పొరుగుబంధం పెరుగుతోంది | Sakshi
Sakshi News home page

పొరుగుబంధం పెరుగుతోంది

Published Sun, Sep 15 2013 3:37 AM

పొరుగుబంధం పెరుగుతోంది - Sakshi

భాగ్యనగరవాసుల మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాల వారధి
‘బిజీ’వితంలోనూ చుట్టుపక్కల వారి పట్ల పెరుగుతున్న ఆత్మీయత

 
 ఇరుగిల్లు ఎవరిదో పొరుగింట్లో ఎవరుంటారో తెలియనంత బిజీగా ఉరుకులు పరుగుల మధ్య జీవితాన్ని గడిపేసే నగరవాసి మనస్తత్వంలో మార్పు వస్తోంది. పలకరింపులు కూడా మహాభాగ్యంగా మారిన నగర జీవనాల్లో పాతకాలపు బాంధవ్యాలు మళ్లీ  చిగురిస్తున్నాయి. చుట్టుపక్కల వారితో  స్నేహ సంబంధాలు పెంచుకుంటూ ఆత్మీయతను పంచుకునే పరిణతి భాగ్యనగర వాసిలో పెరుగుతోంది. పండుగలు పబ్బాలకు తరచుగా కలుస్తుండటం..
 
 ఆపదల్లో పరస్పరం చేదోడు వాదోడుగా ఆదుకోవటం.. గొడవలకు తావివ్వకుండా స్నేహపూర్వకంగా మెలగటం వంటి బంధాలు నిదానంగానైనా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే.. ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరుగుపొరుగులతో అనుబంధం అనే అంశంపై హైదరాబాద్ నగరంలో ‘సాక్షి’ నిర్వహించిన శాంపిల్ సర్వే ఫలితాల సారాంశమిదీ...  
 
 గల్లీలో అందరూ గుర్తే:  ఒకే వీధి/గల్లీ/సందు/కాలనీలో తమతో పాటు నివసిస్తున్న అందర్నీ గుర్తుపట్టగలమని 64 శాతం మంది నగరవాసులు అంటున్నారు. అయితే గుర్తుపట్టలేమనే వారు 26 శాతం ఉంటే.. అసలు గుర్తు పట్టాల్సిన అవసరమే లేదని పది శాతం మంది ఉన్నారు.
 
 సన్నిహితులూ ఎక్కువే: చుట్టుపక్కల ఉన్నవారిలో పరిచయానికే పరిమితం కాకుండా సన్నిహితంగా మెలిగే వ్యక్తుల సంఖ్య పది మందికన్నా ఎక్కువని చెప్తున్న వారు 73 శాతం మంది ఉండటం విశేషం. ఇద్దరు ముగ్గురు సన్నిహితులు ఉన్నట్లు 25 శాతం మంది చెప్తే.. ఎవ్వరూ లేరనే వారు రెండు శాతం మంది.
 
 శుభకార్యాలకు తరచూ పిలుపులు:
 ఇరుగుపొరుగు వారు శుభకార్యాలకు పరస్పరం తరచుగా ఆహ్వానాలు ఇచ్చిపుచ్చుకుంటున్న వారు 48 శాతం మంది ఉంటే.. అప్పుడప్పుడూ ఆహ్వానాలు అందుకునే వారు 39 శాతం మంది ఉన్నారు. అసలు అలాంటి ఆహ్వానాలేవీ లేవనే వారి సంఖ్య 13 శాతం ఉండటం విశేషం.
 
 ఆపదల్లో ఆదుకోవటానికి సిద్ధం: చుట్టుపక్కల ఉన్న వారికి ఏదైనా ఆపద వస్తే ఆదుకోవటానికి సిద్ధంగా ఉంటామనే వారు 50% మంది ఉండటం మంచి పరిణామం. వారు బాగా కావాల్సిన వారైతేనే ఆదుకోవటానికి సిద్ధపడేవారు 42% మంది ఉన్నారు. మరో 8 శాతం మంది తమకెందుకులే అని మిన్నకుంటామని చెప్తున్నారు.  
 
 వంటలు పంచుకోవటం తక్కువే: ఇరుగుపొరుగుతో పిండివంటలు పంచుకోవటం చాలా అరుదని, అసలు లేదని చెప్తున్న వారి శాతం 64% దాకా ఉంది. తరచుగా పంచుకునే వారు 36% మంది ఉన్నారు.
 
 క్లీన్ అండ్ పీస్: తమ వీధిలో చుట్టుపక్కలవారి మంచితనం తమకు బాగా ఇష్టమనే వారు 34 శాతం మంది ఉంటే.. వీధి ప్రశాంతంగా ఉండటం (33 శాతం మంది), పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం (33 శాతం మంది) ఇష్టపడే వారు రెట్టింపు ఉన్నారు.
 
 వారూ మా కుటుంబమే..: చుట్టుపక్కలవారిని కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తామనే వారు కూడా 24 శాతం మంది ఉండటం విశేషం. అయితే.. పొరు గు వారిని పరిచయస్తులుగా మాత్రమే పరిగణిస్తామనే వారే ఎక్కువగా 68% మంది ఉన్నారు. పూర్తిగా అపరిచితుల్లాగే చూస్తామనే వారు 8% మంది ఉన్నారు.  
 
 పొరుగుతో తగవులు పడం: ఇరుగుపొరుగు వారితో తగాదాలకు దూరంగా ఉంటామంటున్న నగరవాసుల సంఖ్య 45 శాతంగా ఉంది. ఒకవేళ ఏదైనా గొడవ వచ్చినా ఆ మరుసటి రోజే మరిచిపోతామనే వారు 33 శాతం మంది ఉంటే.. ఒకసారి గొడవపడితే ఇక గొడవేననే వారు 13 శాతం మంది ఉన్నారు.
 - - హైదరాబాద్, సాక్షి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement