జనన నమోదు ఆలస్యమైతే చిక్కులే

Rejection to Birth Certificates on Late registrations - Sakshi

ఆలస్యపు రిజిస్ట్రేషన్ల తిరస్కరణ

సకాలంలో దరఖాస్తు చేసుకుంటే సులభం

సాక్షి, అమరావతి: తెలిసో, తెలియకో సకాలంలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోనివారు అష్టకష్టాలు పడుతున్నారు. ఆలస్యంగా జనన ధ్రువీకరణ రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తులను ఎక్కువగా అధికారులు తిరస్కరిస్తున్నారు.  గత ఏడాది కాలంలో ఆలస్యంగా జనన నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 19,230 అర్జీలను అధికారులు తిరస్కరించారు. గత ఏడాది జులై 15 నుంచి ఈనెల 15వ తేదీ వరకూ మొత్తం 90,929 అర్జీలు రాగా తిరస్కరించినవి కాకుండా మరో 14,163 అర్జీలను అధికారులు పెండింగులో పెట్టారు. అర్జీలు తిరస్కరణకు గురైన వారు జనన ధ్రువీకరణ పత్రాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

ఈ కష్టాలు పడకుండా ఉండాలంటే సకాలంలో జననాల నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బాబునైనా, పాపనైనా పాఠశాలలో చేర్పించాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అంతేకాదు జీవితంలో ఎక్కడ ఏ పనికావాలన్నా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కావాల్సిందే. ఇంతప్రాధాన్యం ఉన్నందునే ప్రసవం జరగ్గానే పిల్లల పుట్టిన తేదీని నమోదు చేసి పంచాయతీలు/మున్సిపాలిటీలు/ నగరపాలక సంస్థలకు (ఆస్పత్రి ఏ పరిధిలో ఉంటే అక్కడికి) పంపించి రికార్డు చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఇళ్లలో పుట్టిన పిల్లలకు మాత్రం ఈ సదుపాయంలేదు. ఆస్పత్రుల్లో కాకుండా ఇళ్లలో పిల్లలు పుట్టిన వెంటనే వారు ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి జనన ధ్రువీకరణ పత్రం పొందాలి. 

నమోదు ఎలాగంటే... 
 ఒకవేళ పిల్లలు పుట్టిన ఏడాదిలోగా జనన నమోదు చేయించుకోనిపక్షంలో ఈ విషయం ధ్రువీకరణ కోసం నాన్‌ అవైలబులిటీ సర్టిఫికేట్‌ కోసం మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేసుకున్న దరఖాస్తులను వారు పరిశీలించి ఎక్కడా జనన నమోదు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత లేట్‌ బర్త్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఏడాది తర్వాత జనన నమోదు కావాలంటే మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా మీసేవ ద్వారా వచ్చిన అర్జీలను తహసీల్దార్లు పరిశీలించి వారి జననాలు నమోదు కాలేదని నిర్ధారించాల్సి ఉంటుంది.

ఇలా నిర్ధారించిన తర్వాత వారికి డివిజనల్‌ రెవెన్యూ అధికారి జనన నమోదు ధ్రువీకరణకు ఆమోదిస్తారు. ఇలా నమోదైన తర్వాత ఎప్పుడైనా మీసేవ నుంచి జనన ధ్రువీకరణ పత్రం పొందవచ్చు. ఏడాది తర్వాత జనన నమోదు కోసం మీసేవలో దరఖాస్తు చేసిన వారు నగర నివాసులైతే నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి పుట్టిన తేదీ నమోదు కాలేదని (నాన్‌ అవైలబులిటీ) సర్టిఫికేట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకోవడం చాలా కష్టమని, అధికారులు ఎన్ని సార్లు తిరిగినా ఎందుకు నమోదు చేయించుకోలేదంటూ తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top