మనం తెలుగువాళ్లం... ‘బంగారూ’ | RBI House Hold Report reveals about telugu people passion on gold and land | Sakshi
Sakshi News home page

Oct 8 2017 4:14 AM | Updated on Oct 8 2017 8:11 AM

RBI House Hold Report reveals about telugu people passion on gold and land

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలు స్థిరాస్తి, బంగారంపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్‌ ఫండ్స్, షేర్లు వంటి అనేక ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు అందుబాటులో ఉన్నా తాము భూమి, బంగారాన్నే గట్టిగా నమ్ముతున్నామంటున్నారు. దేశంలో కుటుంబ ఆదాయం, పొదుపు, రుణ అలవాట్లపై ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు సంప్రదాయంగా వస్తున్న స్థిరాస్తి, బంగారంలోనే అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. తెలంగాణలో ఒక కుటుంబం పొదుపు చేస్తున్న మొత్తంలో 70.5 శాతం రియల్‌ ఎస్టేట్‌ ( స్థలాలు, బిల్డింగ్‌లు)లోనే ఇన్వెస్ట్‌ చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిగా తక్కువగా 62.8 శాతం స్థిరాస్తిలో మదుపు చేస్తున్నారు. తక్కువ అక్షరాస్యత, గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో అయితే 80 నుంచి 90 శాతం రియల్‌ ఎస్టేట్‌కే కేటాయిస్తున్నారు. బీహార్‌ ప్రజలు అత్యధికంగా 90.5 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌కు కేటాయిస్తుండగా, అండమాన్‌ నికోబార్‌ ప్రజలు అత్యల్పంగా 42.5 శాతం మంది స్థిరాస్తిలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

దక్షిణాది ఓటు బంగారానికే...
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ప్రజలు బంగారం కొనుగోలుపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, వారి సాంస్కృతిక అలవాట్లే దీనికి కారణంగా ఆర్బీఐ పేర్కొంది. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రావాళ్లు బంగారం ఎక్కువగా కొంటున్నారు. తెలంగాణలో 17.5 శాతం బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తుండగా, ఆంధ్రాలో అది 21.6 శాతంగా ఉంది. దేశంలో అందరికంటే అత్యధికంగా తమిళనాడులో 28.3 శాతం, పాండిచ్చేరిలో 25.7 శాతం బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. పంజాబ్‌తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో 5 శాతం కూడా బంగారానికి కేటాయించక పోవడం విశేషం. అత్యధిక అక్షరాస్యత, తలసరి ఆదాయం ఉన్న కేరళ ప్రజలకు బంగారంపై మనకంటే ఎక్కువ మోజు లేదు. కేరళలో కేవలం 13.1 శాతం మంది మాత్రమే బంగారంపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి వాళ్లు బంగారం కొనడమే కాదు... వాటిపై రుణాలు కూడా భారీగానే తీసుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తీసుకుంటున్న రుణాల్లో బంగారం అగ్రస్థానంలో ఉంది. పాండిచ్చేరిలో 50.1 శాతం, తమిళనాడులో 41.3 శాతం రుణాలను బంగారాన్ని తనఖా పెట్టి తీసుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో 9.5 శాతం, తెలంగాణలో 2.9 శాతం మాత్రమే బంగారం రుణాలు ఉన్నాయి.

ఆర్థిక అక్షరాస్యతలో ఏపీ ముందంజ
ఆర్థిక అక్షరాస్యత విషయంలో కేంద్రపాలిత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఢిల్లీ, చండీఘడ్, సిక్కిం, దాద్రా నగర్‌ హవేలి, డామన్‌ డయ్యూ వంటి చోట్ల 10 శాతం వరకు ఫైనాన్షియల్, పెన్షన్‌ పథకాలకు కేటాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3.8 శాతం బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్‌ ఫండ్స్, షేర్ల వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటే.. పెన్షన్‌ పథకాల్లో 3.1 శాతం ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 2 శాతం ఫైనాన్షియల్‌ పథకాలకు, 2.4 శాతం పెన్షన్‌ పథకాలకు కేటాయిస్తున్నారు. రుణాలను విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 48.9 శాతం మంది, తెలంగాణలో 55.8 శాతం మంది ప్రైవేట్‌ ఫైనాన్స్‌పై ఆధార పడుతున్నారని ఆర్‌బీఐ ఆ నివేదికలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement