రాష్ట్రాన్ని విభజిస్తే సీమ ఏడారిగా మారుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆయన కర్నూలు నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే సీమ ఏడారిగా మారుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆయన కర్నూలు నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే జిల్లా మంత్రులు విహార యాత్ర పేరుతో విదేశాలకు వెళ్లడం శోచనీయమన్నారు. 50 ఏళ్లకు పైగా అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ విభజించి ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టిందన్నారు. సీడబ్ల్యూసీ విభజన ప్రకటన చేసినప్పుడు మంత్రి టీజీ వెంకటేష్ సమైక్యాంధ్రకే మద్దతని.. పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రజాభీష్టం మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశానంటూ ఆర్భాటంగా ప్రకటించారన్నారు. అయితే ఆ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి హోదాలోనే పాల్గొని తన వక్రబుద్ధి నిరూపించుకున్నారని విమర్శించారు.
సోనియాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించే దమ్ము సీమాంధ్ర మంత్రులకు లేదన్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం.. అక్రమ ఆస్తుల కేసులకు భయపడి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. విభజనపై బాబు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు వివరించాలన్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లా రైతులతో ఉన్న జల వివాదాలు విభజనతో మరింత ముదురుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ప్రాంతానికే చెందిన కిరణ్‌కుమార్ సీఎంగా ఉన్నప్పటికీ పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సర్వేకి నిధులు మంజూరు చేసినా జిల్లాకు చెందిన మంత్రులు, నాయకులు నోరెత్తకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో మంత్రి టీజీ విలేకరుల సమావేశంతో సరిపెట్టడం దారుణమన్నారు.
జిల్లాకు వస్తే ప్రజలు తిరగబడతారనే మంత్రి టీజీ విదేశీ యాత్ర, కేంద్ర మంత్రి కోట్లతో పాటు జిల్లాకు చెందిన మరో రాష్ట్ర మంత్రి ఢిల్లీలో మకాం వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకే పరిమితం అయ్యారన్నారు. ప్రజలు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైఎస్‌ఆర్‌సీపీ ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. దీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రాంభూపాల్‌రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, మాజీ కార్పొరేటర్లు పెరుగు పురుషోత్తంరెడ్డి, తోట వెంకటక్రిష్ణారెడ్డి, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, బాలరాజు, బురాన్‌దొడ్డి మురళీధర్ ఆచారిలు మద్దతు తెలిపారు. రెండో రోజు ఎస్వీతో పాటు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూసీ మజ్దూర్ యూనియన్ నాయకులు రత్నాకర్‌రావు, ప్రభుదాస్, శాంతిరాజ్, నాగేంద్రయ్య, నాగన్న, మధుకుమార్, మౌలాలి, జెర్మియా, చిన్న, మద్దమ్మ, రంగన్న, ఎంవి.కుమార్, రాజేశ్వరయ్య, వైఎస్సార్సీపీ నగర నాయకులు బుజ్జిబాబు, భాస్కర్, బ్రదర్ సమ్సోనన్న, సురేష్, సోమిశెట్టి శ్రీనివాసులు, ఖలీల్ అహ్మద్, శ్రీనివాసులు, రామయ్య, సువర్ణరాజ్, లాజరస్‌లు దీక్ష చేపట్టారు.