కొండ గుట్టు పెరుమాళ్ల కెరుక

Ramana Deekshitulu Comments On TTD Board - Sakshi

చారిత్రక కట్టడాలు పగులగొట్టడం వెనుక రహస్యముంది

నేలమాళిగల కోసమే తవ్వకాలు జరిపారన్న రమణ దీక్షితులు

కెంపు డైమండ్‌ అమ్ముకున్నారని ఆరోపణ

వాస్తవం లేదంటున్న ఈఓ సింఘాల్‌

ఆగమశాస్త్రం ప్రకారమే అన్ని పనులు చేస్తున్నామంటూ వివరణ

శ్రీవారి ఆలయాన్ని చుట్టుముడుతున్న వివాదాలు

సాక్షి, తిరుపతి : ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం. ఆయన చేసిన ఆరోపణలతో టీటీడీ పాలకమండలి పనితీరుపై భక్తుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధాన అర్చకులుగా పనిచేసిన వ్యక్తి చేసిన ఆరోపణలపై ఆధారాలతో కూడిన రికార్డులను చూపించి నిజాయితీ నిరూపించుకోవా ల్సిన  బాధ్యత ఇటు టీటీడీ, అటు ప్రభుత్వంపై ఉందని హిందూ ధార్మిక సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కనపెట్టి రమణ దీక్షితులపై ప్రతి దాడి చేయటమే లక్ష్యంగా టీటీడీలోని కొందరు, ప్రభుత్వంలోని మరికొందరు పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయంలో జరుగుతున్న మోసాలను వెలుగులోకి తీసుకొచ్చినందుకే ఆయనపై వేటు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు తెరపైకి రాని 65 ఏళ్ల రిటైర్‌మెంట్‌ అంశాన్ని ఇప్పుడే ఎందు కు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక టీటీడీలోని ఓ వర్గం, అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కొందరు కుట్ర చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి సమావేశం ఈనెల 16వ తేదీన జరిగింది. ఆ సమావేశంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయంలో జరుగుతున్న అంశాలను చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంతో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈనెల 15వ తేదీన చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, తప్పులనుఎత్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తప్పులను ఎత్తిచూపుతున్నారనే కారణంతో పాలకమండలి సమావేశంలో 65 ఏళ్ల రిటైర్‌మెంట్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు టీటీడీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది నిజం... ఏది అబద్ధం..?
శ్రీవారికి సమర్పించిన కానుకలు మాయమవుతున్నాయన్నది రమణ దీక్షితుల ప్రధాన ఆరోపణ. అందులో కోట్ల రూపాయలు విలువచేసే కెంపు డైమండ్‌ విదేశాల్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారన్నది ముఖ్యమైంది. అదేవిధంగా ఆలయంలో తరచూ నిర్మాణాలు చేపట్టడం.. అది కూడా ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున కట్టడాలు చేపట్టడం ఆగమశాస్త్రానికి విరుద్ధమని ఆయన చెప్పారు. ఇందులో వంటశాలలో నేలను తవ్వి నాలుగు బండలను మార్చారన్నది ముఖ్యమైంది. ఆ నాలుగు బండలను మార్చటానికి 25 రోజుల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నిం చారు. ఆ సమయంలో 22 రోజుల పాటు పోటు ఎందుకు మూసివేయాల్సి వచ్చిందని ప్రశ్నిం చారు. ఎవరి అనుమతులు లేకుండా ఎందుకు బండలను మార్చాల్సి వచ్చిందని రమణదీక్షితులు నిలదీశారు. నేలమాళిగల కోసమే ఈ తవ్వకాలు చేపట్టారని  ఆరోపించారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ప్రసాదాలను వేరొక చోట తయారు చేశారనేది మరో ప్రధాన ఆరోపణ.

ఇదిలా ఉంటే టీటీడీ అధికారులు కొందరు వీవీఐపీల సేవలో తరిస్తూ భక్తులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా స్వామి వారికి ప్రతిరోజూ జరిగే సుప్రభాతసేవను అర్ధరాత్రి నుంచి నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని, 20 నిమిషాల పాటు జరగాల్సిన తోమాల సేవను 10 నిమిషాల్లో ముగించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టీటీడీలో ప్రచారం జరుగుతోంది. రమణ దీక్షితులు చేసిన ప్రధానమైన ఆరోపణలపై ఆదివారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, మరో వైపు నూతనంగా నియమితులైన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షతులు, కాశీపతి స్వామి, కృష్ణశేషసాయి దీక్షితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జీఓ ప్రకారమే 65 ఏళ్ల రిటైర్‌ మెంట్‌ తీసుకొచ్చామని, ఆగమశాస్త్రం ప్రకారమే స్వామి వారి కైంకర్యాలు.. సేవలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఎప్పుడైనా చూపించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఆలయంలో సౌకర్యాల కోసం చిన్నచిన్న మార్పులు చేయడం సర్వసాధారణమని వెల్లడించారు. ఈఓ సింఘాల్‌ చెప్పినట్లు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అయితే... ఆధారాలతో కూడిన వివరణలు ఇవ్వాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. దేవస్థానం ప్రతిష్ట, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవాలు తెలియజేయాలని కోరుతుండడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top