16వ శతాబ్దంలోనే ప్రపంచ పటంలో..

Ramallakota History Special Story In Kurnool District - Sakshi

నాటి రవ్వల కోట.. నేటి రామళ్ల కోట 

సాక్షి, వెల్దుర్తి: విజయనగర సామ్రాజ్య ఘనత గురించి ప్రస్తావన వస్తే ఆనాటి ఆలయాల నిర్మాణాలు, శత్రుదుర్భేద్య కోటలు, రక్షణ గోడలు, రాయల పరిపాలనతో పాటు అప్పట్లో విశాలమైన వీధుల్లో ముత్యాలు, కెంపులు, నీలాలు, వజ్రాలు రాశులుగా పోసి విక్రయించిన వైనాన్ని చెప్పుకోవాల్సిందే. ఆ వీధుల్లో అమ్మిన వజ్రాలు ఎక్కువగా ఎక్కడి నుంచి తెచ్చారని తెలుసుకోవాలని ఉందా.. అయితే నాటి రవ్వల కోట వజ్ర వైభవాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందే. 16వ శతాబ్దంలోనే ప్రపంచ వజ్ర నిక్షేప పటంలో స్థానం సంపాదించుకున్న నేటి రామళ్లకోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాజులు, నవాబులు, బ్రిటీషు  వారి కాలంలో పాలనా కేంద్రంగా విరాజిల్లిన ఈ గ్రామం ఎన్నో విశేషాలకు నిలయంగా నిలిచింది. పూర్వం కృష్ణా, తుంగభద్ర నదీ పరీవాహక, సంగమ ప్రాంతాల్లోని దక్షిణ భాగం దాదాపు 300కి.మీ.ల వరకు అపార వజ్ర నిక్షేపాలుండేవి. వాటిలో గుంటూరు జిల్లా కొల్లూరుతోపాటు, వివిధ జిల్లాల్లోని పరిటాల, గొల్లపల్లి, మాలవల్లి, బెల్లంకొండ, బనగానపల్లె, రామళ్లకోట, వజ్రకరూర్, జొన్నగిరి ప్రాంతాలు ప్రసిద్ధి.

వజ్రాన్వేషణ సందర్భంగా రవ్వలకొండపై కారి్మకుల రాళ్ల గృహాల ఆనవాళ్లు
ఈ ప్రాంతాల నుంచే కోహినూర్, గ్రేట్‌ మొఘల్‌ వజ్రాలు వెలికి తీశారని చరిత్ర చెబుతోంది. రవ్వల కోటగా ప్రసిద్ధి కెక్కిన కొండల పక్కనే రవ్వల వెలికితీత గనుల్లో వేల మంది కార్మికులు పని చేసిన చారిత్రక ఆధారాలున్నాయి. వారు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో కుగ్రామంగా ఏర్పడింది. పదుల సంఖ్యలో బ్రాహ్మణులు, రెడ్డి, కరణాలు,  తదితర కులవృత్తుల వారు ఉండేవారు. చాళుక్యులు, చోళలు, కాకతీయుల అనంతరం విజయనగర సామ్రాజ్య స్థాపన తర్వాత శ్రీకృష్ణదేవ రాయల ఏలుబడిలో రామళ్లకోటకు చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. ఈ ప్రాంతాల నుంచి వెలికితీసిన వజ్రాలు నాడు విజయనగర (హంపి, పెనుకొండ తదతర ప్రాంతాల్లో) వీధుల్లో, అంగళ్లో విక్రయించారని ఇప్పటికీ చెబుతుంటారు.   

ఆనాటి ఆర్‌డీఎం 
నేటి కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) తరహాలోనే నాడు ఆర్‌డీఎం (రామళ్లకోట డైమండ్‌ మైన్స్‌)గా ఇక్కడి వజ్రాల గనులు ప్రసిద్ధి చెందాయి.  1776 నవంబర్‌ 12న ఈస్టిండియా కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం నాటి నిజాం నవాబు, దత్త మండలంగా పిలువబడిన నేటి రాయలసీమ ప్రాంతం ఆంగ్లేయులు స్వా«దీనం చేశారు. నాటి నుంచి 19వ శతాబ్దం మధ్య వరకు రామళ్లకోటలో బ్రిటీషర్ల పాలన సాగింది. మొత్తంగా గుంటూరు జిల్లాలోని ప్రఖ్యాత కొల్లూరు మైన్స్‌తో కలిపి వివిధ మైన్స్‌లలో (వజ్రాల గనులలో) దాదాపు 60 వేల మంది కార్మికులు ఆనాడు పని చేస్తుండగా ఒక్క రామళ్లకోటలో దాదాపు 30 వేల మంది కారి్మకులు పనిచేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరి కాలంలోనే దశాబ్దాల పాటు వజ్రాన్వేషణ అధికమై, కొండలను జల్లెడ పట్టి విలువైన సంపద తరలించినట్లు తెలుస్తోంది. ఆనాడు వజ్రాల కొనుగోళ్లకు యురోపియన్‌ దేశాల నుంచి వ్యాపారులు వచ్చారు. స్వాతం్రత్యానంతరం 1955 వరకు ఇక్కడ వజ్రాన్వేషణ సాగింది. నేడు ఆ గనులు ఒట్టిపోయి నాటి స్మృతుల ఆనవాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి.

నవాబుల కాలంలో.. 
తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనానంతరం రామళ్లకోట ప్రాంతం బహుమనీ సుల్తానులు, గోల్కొండ నవాబుల పాలన కిందకు వచ్చింది. కుతుబ్‌షాహీ, అసంజాహీ (గోల్కొండ) నవాబులు, ఇక్కడి అపార వజ్ర నిక్షేపాలు వెలికి తీసి తరలించుకున్నారు.   

ఖనిజాల ఖిల్లా 
వజ్ర నిక్షేపాలకు నిలయమైన నాటి రామళ్లకోట అపార ఖనిజ సంపదకు ఆలవాలమై తన ప్రత్యేకత నిలుపుకుంటోంది. సమీప కొండలు, పొలాల గర్భంలో ఇపుప ఖనిజం, సున్నపురాయి, పచ్చసుద్ధ, సిలికా శ్యాండ్‌ లభిస్తోంది.  స్వాతంత్రానికి పూర్వం నుంచి జోషి కంపెనీ ఇక్కడి ఇనుప ఖనిజాన్ని వెలికితీస్తోంది. పలువురు సైతం మైనింగ్‌ చేస్తున్నారు.

బ్రిటీషు  పాలనలో అభివృద్ధి.. 
1839–58ల మధ్య కాలంలో బ్రిటీషర్లు కర్నూలు జిల్లాను 8 తాలూకా కేంద్రాలు (నందికొట్కూరు, పత్తికొండ, శిరివెళ్ల, నంద్యాల, మార్కాపురం, రామళ్లకోట)గా విభజించి పరిపాలన సాగించారు. 1886లో రామళ్లకోట తాలూకాలో రామళ్లకోట కేంద్రంగా 106 గ్రామాలు (కర్నూలు కలిపి)ఉండేవి. జనాభా 1,42,855 మంది. ఈ కాలంలోనే రామళ్లకోటలో సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయం, ట్రెజరీ, జైలు (కలిపి కచేరి అనేవారు) నిర్మించబడి, పోలీసు వ్యవస్థ ప్రారంభమైంది. ఈ తాలూకా పరిధి కర్నూలు, సుంకేసుల వరకు భూములు, ఆస్తుల రిజి్రస్టేషన్లు రామళ్లకోటలోనే సాగాయి. అప్పట్లో రామళ్లకోట వాసులు పన్నులకు వ్యతరేకంగా బ్రిటీషర్లతో పోరాడగా వారిని పోలీసు వ్యవస్థతోపాటు,  పాలెగాళ్లతో బెదిరించి వసూలు చేశారు.

చెక్కుచెదరని దారులు.. 
బ్రిటీష్‌ పాలనలో రవాణా సౌకర్యం కోసం కొండ ప్రాంతాల్లో గుర్రాలపై, కాలినడక వెళ్లేందుకు నిర్మించిన దారులు నేటికీ చెక్కు చెదరలేదు. పెద్ద బండ రాళ్లతో పాదచారులు, గుర్రాలు అలుపెరగకుండా ప్రయాణించేలా నిర్మిచారు. ఈ దారుల్లో కొన్ని (సిద్ధినగట్టు, కృష్ణాపురం నుంచి రామళ్లకోటకు, రామళ్లకోట నుంచి కల్లూరు మండలం వైపు) నేటికీ వాడుకలో ఉన్నాయి.
 
ఆంగ్లేయులు నిర్మించిన గుర్రపు ఓణీ 

రాయల పాలనలో.. 
శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రాంలో తాత్కాలిక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐదు కోట బురుజులు, వాటి పక్కనే కోట వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, గ్రామదేవత కాలమ్మల(మిగతా రెండు గుర్తించడానికి వీలులేకుండా ఉన్నవి) ఆలయాలు ఆనాడు నిర్మితమైనవే. అలాగే వనం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడి ఆలయ నిర్మాణం శిల్ప కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. చైత్రమాసంలో నవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేపడతారు. అలాగే ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 6వ తేదీన ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఆలయం మండపం మధ్యలో ఆకుపచ్చ వర్ణంలోని బండను (గ్రానైట్‌ రకానికి చెందినది) గ్రామస్తులు సత్యపీఠంగా భావిస్తారు. దానిపై నిలుచుని ఎవరూ అబద్దాలు చెప్పరని ప్రజల విశ్వాసం. అలాగే రాయల నీటి 101 ఆలయాలు, 101 బావుల్లో కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వనం శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని దిగుడు బావి రెండు వైపులా మెట్లతో నిర్మితమై నాటి కళను సాక్ష్యాత్కరిస్తోంది. అలాగే నాగులబావి (పూర్యం ఈ బావిలో వేకువజామున దేవకన్యలు వచ్చి జలకాలాడేవారని ప్రసిద్ధి), పూలబావి (పూర్వం పూల పంట కోత అనంతరం పూలను బావిలోని నీటితో తడిపిన తర్వాతనే అమ్మకానికి తీసుకెళ్లేవారు), కోట్లబావి, గిలకలబావి, గాడుబావి, పీర్లబావి, దిగుడుబావి, కోనేటిబావి, చేదుడుబావి, పార్వతిగారి బావులు ఇప్పటికీ ఉన్నాయి.   

ఉట్ల మంటపాలు, రచ్చకట్టలు
వైష్ణవ సంప్రదాయంలో స్వామి వారి సేవకు (ఊయల సేవ) ఈ మంటపాలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ మంటపాల్లో ఉత్సవాల నాడు స్వామి వారికి సేవలు కొనసాగిస్తున్నారు. అలాగే గ్రామంలో వీధికో మహా వృక్షం, చుట్టూ అరుగు ఉన్నాయి.  వీటిలో రావిమాను రచ్చ (వ్యవసాయ, వాణిజ్యాలకు నిలయం), ఎర్రన్న గారి రచ్చ, పోతురాజు కట్ట, తదితర దాదాపు 10కి మించి రచ్చకట్టలు విజయనగరరాజుల కాలంలోనూ, బ్రిటీష్‌ వారి కాలంలోనూ నిర్మితమైనట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. 

వనం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని రెండువైపులా దిగుడు మెట్ల బావి  
 
శిథిలావస్థలో చారిత్రక సంపద 
గ్రామ చరిత్రను తెలిపే పలు సాక్ష్యాలు శిథిలమైపోయాయి. విజయ నగర రాజుల కాలం నాటి పలు ఆలయాలు, బావులు శిథిలమైపోయాయి. ప్రహరీ, కోట బురుజులు కూలిపోయాయి. ప్రస్తుత పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉండే నాటి బ్రిటీషర్లు పాలన సాగించిన రిజి్రస్టార్, ట్రెజరీ, చెరసాల (కచేరి) కూలిపోయింది, విలువైన చెక్క సంపద చెదలు పట్టింది.    

1955లో పంచాయతీగా..
రామళ్లకోట గ్రామం వెల్దుర్తి మండలంలోని పెద్ద పంచాయతీల్లో ఒకటి. మండల కేంద్రం నుంచి తూర్పు దిక్కున 11 కి.మీ. దూరంలో ఉంది. ప్రస్తుత జనాభా దాదాపు 5 వేలు. కుటుంబాలు 1000కు మించి ఉన్నాయి. 1227 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. కూలీలు ఎక్కువ. 1955 సంవత్సరాన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అక్షరాస్యత 56 శాతం. గ్రామం నుంచి వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ శాఖలలో ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు ఎంతో మంది ఉన్నారు.
  
రామళ్లకోట ఏరియల్‌ వ్యూ 
ప్రపంచ గుర్తింపు తేవాలి 
ఘన చరిత్ర ఉన్న రామళ్లకోటకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చేందుకు పాలకులు, అధికారులు కృషి చేయాలి. విశిష్టత గుర్తుకు తెచ్చేలా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలి. గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. చరిత్రకు సాక్ష్యంగా శిథిలావస్థలోని కోటలో వీరభద్రస్వామి బురుజు, స్వామి వారి ఆలయ జీరో్ణద్ధారణ ప్రభుత్వ సాయంతో చేయాలి. – మంచిరెడ్డి శశి, వీరభద్రస్వామి ఆలయ కమిటీ ప్రతినిధి

చింతకాయలకు పన్ను కట్టారు 
గతంలో చింతచెట్లు వనంలా ఉండేవి.   రైతులకు ఎంతో కొంత చెల్లించి, ఆ చెట్ల నుంచి వచ్చిన ఫలసా యాన్ని పొంది మా పూరీ్వకులు జీవనోపాధి పొందేవారు. అయితే బ్రిటీషుల పాలన వచ్చిన తర్వాత నుంచి చింతచెట్ల నుంచి చింతకాయలు తీసుకునేందుకు ఒక్కో చెట్టుకు ఇంత పన్ను అన్నట్లుగా ప్రత్యేకంగా పన్నులు కట్టారు. అందుకు మా దగ్గర ఇప్పటకీ ఆధారాలు ఉన్నాయి.  – గునారి వీరయ్య, రామళ్లకోట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top