
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై సినీ దర్శకుడు రాజమౌళి లండన్‌లో నార్మన్ ఫోస్టర్ ఆర్కిటెక్ట్ సంస్థ ప్రతినిధులకు సలహాలిచ్చారు. రాజధాని డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ సంస్థ రెండురోజులపాటు నిర్వహించిన సదస్సులో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తోపాటు రాజమౌళి బృందం కూడా పాల్గొంది. ఈ బృందాన్ని సీఆర్‌డీఏ అధికారులు ప్రత్యేకంగా లండన్ తీసుకెళ్లారు. సదస్సులో రాజమౌళి భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే దానిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
అసెంబ్లీ భవనం ఎలా ఉండాలి, ఇక్కడి చరిత్ర, సంస్కృతి, వారసత్వం తదితర అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది. కొద్ది రోజుల కిందట ఫోస్టర్ సంస్థ ఇచ్చిన తుది డిజైన్లను తిరస్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజమౌళిని సంప్రదించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.