రచ్చబండ నిర్వహణకు చాలీచాలని కేటాయింపులు | Raccabanda management calicalani allotments | Sakshi
Sakshi News home page

రచ్చబండ నిర్వహణకు చాలీచాలని కేటాయింపులు

Nov 18 2013 4:21 AM | Updated on Sep 2 2017 12:42 AM

రచ్చబండ కార్యక్రమం గతంలో పంచాయతీకోచోట నిర్వహించే వారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కడ నిరసనలు వ్యక్తమవుతాయోనన్న భయంతో ఈసారి మండల కేంద్రాలకు ప్రభుత్వం పరిమితం చేసింది.

=రచ్చబండ నిర్వహణకు చాలీచాలని కేటాయింపులు
 =సమకూర్చడానికి నానా తంటాలు
 =ప్రకటించిన రూ.70 వేలూ ఇవ్వని దుస్థితి

 
సాక్షి, విశాఖపట్నం : రచ్చబండ కార్యక్రమం గతంలో పంచాయతీకోచోట నిర్వహించే వారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కడ నిరసనలు వ్యక్తమవుతాయోనన్న భయంతో ఈసారి మండల కేంద్రాలకు ప్రభుత్వం పరిమితం చేసింది. దీని నిర్వహణకు రూ.70వేలు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం ఏ కోశాన సరిపోదు. ఒక్కో మండలంలో 30పంచాయతీలు ఉన్నాయి. కార్యక్రమానికి ఆసక్తి చూపే వారిని, ఇళ్లు, పింఛను, రేషన్‌కార్డుల లబ్ధిదారుల్ని అధికారులే మండల కేంద్రానికి తీసుకురావాలి.

ఇందుకు ప్రతి గ్రామానికి వాహనం సమకూర్చాలి. వచ్చే వారికి విధిగా మంచినీటి ప్యాకెట్లు, ఇతరత్రా ఆహారం సరఫరా చేయాలి. ఇక రచ్చబండకు ప్రత్యేకంగా వేదిక, అలంకరణ, బ్యాక్‌డ్రాప్ ప్లెక్సీలు, మైక్ సిస్టమ్ ఏర్పాటు తప్పదు. లబ్ధిదారులకు పథకాల పంపిణీకి ఒక్కో పంచాయతీకి మూడేసి కౌంటర్లు(ఇళ్లు, పింఛను, రేషన్‌కార్డు) ఏర్పాటు చేయాలి. వీటికి షామియానాలు, ఫర్నీచర్ సమకూర్చాల్సి వస్తోంది. ఒకవేళ ఒక పంచాయతీలో 150మందికి మించి లబ్ధిదారులంటే ఒక్కో అంశానికి రెండేసి కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వమిచ్చే రూ.70వేలు ఎటూ సరిపోదు.

ఒక్కో మండలానికి సరాసరి 1.5 లక్షలుపైనే ఖర్చవుతోంది. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యే కార్యక్రమానికైతే మరిన్ని హంగులు సమకూర్చడంతో ఆ వ్యయం మరింత పెరిగి పోతుంది. కొన్ని మండలాల్లో ఎమ్మెల్యేల సొంత ప్రయోజనాల కోసం ఐదారు పంచాయతీలకోచోట రచ్చబండ నిర్వహించాలని మండల అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులకు మరింత చేతిచమురు వదులుతోంది.

పోనీ ప్రభుత్వం ప్రకటించిన రూ.70వేలు అయినా ఇచ్చిందంటే ఇంతవరకు అదీ లేదు. ముందు నిర్వహించండి, ఆ తర్వాత ఇస్తామంటూ చేతులు దులుపుకుంది. దీంతో కొందరు మండల స్థాయి అధికారులు పక్కదారి పట్టి చేతులు చాపుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. మరికొందరు తలా ఇంత అని వేసుకుని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో రచ్చబండకు జనాల్ని తీసుకురావడమే కష్టమవుతుందనుకుంటే ఈ నిర్వహణ భారమేమిటని కొందరు అధికారులు వాపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement