వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు అన్ని విధాలా న్యాయం

R Krishnaiah Comments In BC Garjana - Sakshi

బీసీలు అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలి

వైఎస్సార్‌ లాంటి ముఖ్యమంత్రిని నా ఉద్యమ చరిత్రలో చూడలేదు

నన్ను సమావేశాలకు పిలిచి బీసీల డిమాండ్లు ఏమిటో తెలుసుకునేవారు

అటువంటి నిబద్ధతే వైఎస్‌ జగన్‌లోనూ ఉంది

మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్‌

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

సాక్షి ప్రతినిధి, ఏలూరు/గన్నవరం: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ద్వారానే బీసీలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. శాశ్వతంగా అభివృద్ధి చెందాలన్నా, జీవితాల్లో వెలుగులు నిండాలన్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే ఐదేళ్లపాటు బీసీలకు పండుగ వాతావరణం ఉంటుందన్నారు. ఆదివారం గన్నవరంలోనూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలోనూ కృష్ణయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. తాను బీసీ తీవ్రవాదినని, అటువంటి తనను గర్జనకు పిలిచారంటేనే జగన్‌కు బీసీల పట్ల ఎంత నిబద్ధత ఉందో తెలుస్తుందన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను సమావేశాలకు పిలిచి బీసీల డిమాండ్లు ఏమిటో తెలుసుకునేవారని గుర్తుచేసుకున్నారు. బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. వైఎస్సార్‌ బీసీల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ వేసి ఎన్ని కోట్లు ఖర్చయినా బీసీల డిమాండ్లు నెరవేర్చాలని ఆదేశించేవారన్నారు. ఆయన కారణంగానే గుడిసెల్లో ఉండే పేదల పిల్లలు సైతం డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారన్నారు.

బీసీలకు లబ్ధి చేకూర్చింది వైఎస్సార్‌ మాత్రమేనన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు అమలు చేయాలని, గురుకుల పాఠశాలలు, బాలికలు, బాలుర హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే పలు డిమాండ్లతో అమరణ నిరాహార దీక్ష చేయాలని తాను సంకల్పిస్తే తనను ఒక్క గంట కూడా దీక్ష చేయనీయకుండా అన్ని డిమాండ్లను ఆమోదించారన్నారు. ఆయన హయాంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. తన 40 ఏళ్ల ఉద్యమ చరిత్రలో వైఎస్సార్‌ లాంటి నాయకుడిని చూడలేదని తెలిపారు. వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం యువనేత జగన్‌ ముందుకు వచ్చారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే చట్టసభల్లో రిజర్వేషన్‌ పెట్టించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. వైఎస్సార్‌ బీసీలకు చదువు ఇచ్చారని, జగన్‌ అధికారంలో వాటా ఇస్తానని చెబుతున్నారని ఈ నేపథ్యంలో బీసీలు చైతన్యం తెచ్చుకోవాలన్నారు. జగన్‌ అధికారంలోకి వస్తేనే చట్టసభల్లో రిజర్వేషన్‌ సాధ్యం అవుతుందన్నారు. 

చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు
చంద్రబాబు బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు బీసీలు లొంగవద్దన్నారు. టీడీపీ ఎంపీలు ఒక్కసారి కూడా పార్లమెంట్‌లో బీసీల హక్కుల గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు ప్రధాని మోదీని 40 సార్లకు పైగా కలిశారని, అయితే ఒక్కసారైనా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని అడగలేదన్నారు. బీసీలు చేస్తున్న పోరాటానికి స్పందించి పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు పెట్టించిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని చెప్పారు. కాగా, ఆర్‌.కృష్ణయ్య ఏలూరులో బీసీ గర్జన సభకు వెళ్లేముందు కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల అతిథి గృహంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. 

కులాలను దూషించడం చంద్రబాబుకే సాధ్యమైంది.. 
వైఎస్సార్‌ సుపరిపాలన మళ్లీ అందించేందుకే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీని స్థాపించారు. ప్రజలంతా వైఎస్‌ పాలనను.. జగన్‌ ద్వారా కోరుకుంటున్నారు. ప్రతి బీసీ సోదరుడూ వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడాల్సిన తరుణం వచ్చింది. చంద్రబాబు అధికారంలోకొచ్చాక ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన దాఖలాల్లేవు. కేంద్రంలో బీజేపీతో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీకి కూడా మంత్రి పదవి ఇప్పించలేదు. ఒక సీఎం ఒక కులాన్ని ధూషించిన ఘటన దేశంలో ఎక్కడా లేదు.. అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది. అధికారంలోకి రాగానే బీసీల అభ్యున్నతి కోసం వైఎస్‌ జగన్‌ అమలు చేయనున్న కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా ప్రకటించడం బీసీలంతా హర్షించాల్సిన విషయం. సుమారు 16 నెలల పాటు అధ్యయన కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి వైఎస్‌ జగన్‌కు నివేదిక అందించింది. ప్రజల మేలు కోరే జగన్‌.. మనకు నాయకత్వం వహిస్తానంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. జగన్‌కు జై కొట్టి ముఖ్యమంత్రిని చేద్దాం.  
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి 

బీసీలంతా జగన్‌కు అండగా నిలుద్దాం  
నలభై లక్షల బీసీ కుటుంబాల్లో విద్య ద్వారా వెలుగులు నింపిన మహోన్నతుడు వైఎస్సార్‌. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి యావత్‌ బీసీ వర్గమంతా అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది. బీసీలంతా ఒక్కతాటిపైకొచ్చి జగన్‌ను సీఎం చేసుకోవాలి. తరచూ బీసీలను కించపరిచే చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలి. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే.. బీసీల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు.  
– అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే 

ఇది ఎన్నికల హామీ కాదు.. అమలు చేసే వాగ్దానం 
బీసీ డిక్లరేషన్‌.. ఎన్నికల ముందు ఇచ్చే హామీ కాదు.. కచ్చితంగా అమలు చేసే వాగ్దానం. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు బీసీలకు 110 హామీలిచ్చారు. అధికారంలోకొచ్చాక ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇచ్చిన ప్రతి మాటనూ అమలు చేయాలన్న సంకల్పంతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆర్థిక నిపుణులతోనూ, బీసీ నాయకులతో చర్చించి అమలు సాధ్యమయ్యేవే బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారు. కానీ చంద్రబాబు ఈ పథకాన్ని తుంగలో తొక్కారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకానికి వైఎస్‌ జగన్‌ పూర్వ వైభవాన్ని తెస్తారు.  
– పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి 

పాలన అంటే ఎలా ఉండాలో వైఎస్సార్‌ని చూసి నేర్చుకోండి 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జగన్‌మోహన్‌యాదవ్, జగన్‌మోహన్‌గౌడ్, జగన్‌మోహన్‌వర్మలా ఆలోచిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. వారి సమస్యలేంటి? ఏం చేస్తే అవి పరిష్కారమవుతాయని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు తన పాలనలో బీసీలకు కార్పొరేషన్‌ల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అసలు నీదేం పాలన చంద్రబాబూ? పాలన అంటే ఎలా ఉండాలో దివంగత వైఎస్సార్‌ను చూసి నేర్చుకో. కేవలం ఇద్దరు ముగ్గురు ఇంజినీర్లు మాత్రమే ఉన్న గ్రామంలో నేడు ఇంటికో ఇంజినీర్, గ్రాడ్యుయేట్, ఊరికి నలుగురైదుగురు డాక్టర్లున్నారంటే అది వైఎస్‌ పుణ్యమే. బీసీ గర్జన ఓట్ల కోసం పెట్టింది కాదు.. ఏడాదిన్నర కిందటే బీసీల సమస్యలపై జగన్‌.. అధ్యయన కమిటీని వేశారు. చనిపోయాక ఇచ్చే చంద్రన్న బీమా కావాలో, ప్రాణాలను కాపాడే ఆరోగ్యశ్రీ కావాలో ఆలోచించుకుని జగన్‌కు మద్దతు తెలపండి.     
 – కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి 

బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు 
బీసీలందరూ ఈసడించుకునేలా చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని నాయీబ్రాహ్మణులు చంద్రబాబును వేడుకుంటే.. మీ తోకలు కత్తిరిస్తానంటూ అహంకారంగా మాట్లాడారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారు. ఆ హామీని అమలు చేయాలని నిరసన తెలియజేస్తే.. తాట తీస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. రానున్న రోజుల్లో బీసీల చేతిలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదు. ఫెడరేషన్‌ పేరుతో యాదవులను మభ్యపెట్టి వారికి ఏం చేశారు? బోయ, విశ్వబ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, రజక తదితర కులాలను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారు. ఈ అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటానని వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ప్రకటించారు.  విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లేందుకు జగన్‌ దృఢ సంకల్పంతో ఉన్నారు.    
 – తమ్మినేని సీతారామ్, మాజీ మంత్రి 

బీసీల సంక్షేమానికి జగన్‌ కృషి చేస్తారు  
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.35 వేలకు మించి చంద్రబాబు సర్కారు ఇవ్వడం లేదు. వైఎస్సార్‌ హయాంలో మొత్తం ఫీజును రీయింబర్స్‌ చేశారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి.. వారికి ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై పరిశీలన చేసేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి బీసీ కులాల స్థితిగతుల్ని క్షుణ్ణంగా పరిశీలించింది. బీసీల సంక్షేమానికి జగన్‌ కృషి చేస్తారని విశ్వసిస్తున్నాం.  
– నర్సయ్యగౌడ్, మాజీ మంత్రి

బీసీల బంగారు భవిత కోసమే డిక్లరేషన్‌ 
పాదయాత్రలో బీసీల కష్టాలు తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. వారి బంగారు భవిత కోసం డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నారు.  అగ్నికుల క్షత్రియ సామాజికవర్గంలోని 14 ఉపకులాలను ప్రాంతాలవారీగా విడగొట్టి ఒక్కో ప్రాంతానికి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి.. టీడీపీ కుల రాజకీయం చేస్తోంది. మత్స్యకారులను ఎస్టీల్లో, రజకులను ఎస్సీల్లో చేరుస్తానని చంద్రబాబు మోసం చేశారు. మళ్లీ ఎన్నికల వస్తున్న నేపథ్యంలో కుల రిజర్వేషన్‌ల పేరుతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీల స్థితిగతులను మార్చి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు వైఎస్‌ ముందుకొస్తున్నారు. అధికార టీడీపీ ఆగడాలను మనం చూస్తూనే ఉన్నాం. బీసీ సామాజిక వర్గాలను ఆ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో బీసీలు ఒక్కసారి మననం చేసుకోవాలి. నాటి రాజన్న పాలనకోసం వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకుందాం.  
– మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి 

వైఎస్‌ జగన్‌తోనే బీసీల జీవితాల్లో వెలుగులు  
బీసీలను తెలుగుదేశంపార్టీ అణగదొక్కుతోంది. ఈ పాలనలో ఏ ఒక్క బీసీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప.. వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేసిన దాఖలాల్లేవు. బీసీల బతుకుల్లో వెలుగులు రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి. బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కార్పొరేషన్‌ల ద్వారా బీసీల అభ్యున్నతికి కృషిచేస్తానంటూ.. కమీషన్‌లు నొక్కేసి.. వారిని అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.  
– జి.జయరాములు, ఎమ్మెల్సీ 

బాబు గుండెల్లో గుబులు 
రాజన్న బిడ్డ కోసం వచ్చిన బీసీ జన సంద్రాన్ని చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో గుబులు పుడుతోంది. ఒక పక్క తుపానులు, మరో పక్క వర్షాభావంతో కరువు తాండవిస్తుంటే.. చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా కరువుపై దరువు.. అంటాడు. మాయల ఫకీరు మాదిరిగా బీసీల విషయంలో చంద్రబాబు తీరు ఉంది. వైఎస్‌ హయాంలో బీసీలంటే.. బెస్ట్‌ కేటగిరిగా చూసేవారు.. టీడీపీ హయాంలో బిలో కేటగిరిగా మార్చేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుంది.  ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు డ్యాష్‌బోర్డు అయితే లోకేశ్‌ క్యాష్‌బోర్డు. డ్యాష్‌బోర్డు పనిచేస్తేనే క్యాష్‌ బోర్డు కదిలే స్థితిలో ఉంది. ఇటువంటి పార్టీని సాగనంపేందుకు ప్రతి ఒక్క బీసీ పనిచేయాలి.  
– విడుదల రజని, వైఎస్సార్‌సీపీ నేత  

బీసీలకు మేలు చేయాలనుకుంటున్న వైఎస్‌ జగన్‌ను సీఎం చేద్దాం 
పాదయాత్ర చేస్తూ బీసీల కష్టాలను దగ్గరుండి గమనించిన వైఎస్‌ జగన్‌.. వారు ఒక శక్తిగా ఎదగడానికి ప్రణాళికలు రచించారు. కులవృత్తులు అంతరించిపోకుండా రూ.75 వేలు ఇచ్చి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలని చూస్తున్నారు. నవరత్నాల ద్వారా బీసీలకు మేలు జరుగుతుంది. వెనుకబడిన కులాలను ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నదే వైఎస్‌ జగన్‌ ధ్యేయం. బీసీలంతా ఐక్యంగా ఉండి మనకు మేలు చేయాలనుకుంటున్న వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న చంద్రబాబుకు ఓటుతో గుణపాఠం చెబుదాం.  
– ఉషా చరణ్, కళ్యాణదుర్గం సమన్వయకర్త  

రాష్ట్రాన్ని దోచుకుతింటున్న బాబును సాగనంపుదాం 
బీసీల భుజాలపైకెక్కి చంద్రబాబు రాక్షస తాండవం చేస్తున్నారు. యువతను, మహిళలను, రైతులను.. ఇలా అన్ని వర్గాలవారినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలు, రైతులను నిలువునా ముంచారు. రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లును నెల నెలా ఇస్తూ ప్రజలకు షాక్‌ ఇచ్చారు.  ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్రబాబును బీసీలు సాగనంపాలి.  
– కారుమూరి నాగేశ్వరరావు, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త 

కుల వృత్తులను నిర్వీర్యం చేసిన బాబు 
పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకున్న జగన్‌.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండి కూడా జంగా కృష్ణమూర్తి నాయకత్వంలో బీసీ అధ్యయన కమిటీ వేయడం ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమైంది. అన్ని పార్లమెంటరీ డివిజన్ల లోనూ సమావేశాలు పెట్టి 139 కులాలకు సంబంధించిన వినతులు స్వీకరించి.. బీసీల అభ్యున్నతికి డిక్లరేషన్‌ ప్రకటించారు. కులవృత్తులన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేసి.. కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసేలా కుట్రలు పన్నుతున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే బలహీనవర్గాలకు మేలు జరుగుతుంది.                           – మేకా శేషుబాబు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top