స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు లీంకేజీ ద్వారా పొందిన రుణాలు మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు.
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు లీంకేజీ ద్వారా పొందిన రుణాలు మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. ఈ రుణాల మాఫీ ఎప్పటి నుంచి వర్తిస్తుందోనని మహిళలు ఎదురుచూస్తున్నారు. ఒకవైపు రుణ మాఫీ అవుతుందన్న ఆశతో మహిళలు కంతులు కట్టడం మానేయగా.. మరోవైపు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం నిలిపివేశారు! వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 మునిసిపాలిటీల పరిధిలో 11,597 ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి.
ఇవి బ్యాంకుల ద్వారా రూ.228.68 కోట్ల రుణాలు పొందాయి. ఈ మొత్తాన్ని మాఫీ చేయాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడనున్న టీడీపీ ప్రభుత్వంపై ఉంది. ఇదే కాకుండా 1,155 సంఘాలకు సంబంధించి నిలిచిపోయిన రుణ చెల్లింపులు రూ.10.81 కోట్లు, మొండి బకాయిలు రూ.6 కోట్లు ఉన్నాయి. ఒక్క అనంతపురం నగరంలోనే 2,202 ఎస్‌హెచ్‌జీలకు సంబంధించి దాదాపు రూ.41.33 కోట్ల రుణాలున్నాయి. రుణ మాఫీపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందోనని ఎస్‌హెచ్‌జీల సభ్యులు వేచిచూస్తున్నారు. ఎలాగూ రుణ మాఫీ అవుతుందనే ఉద్దేశంతో బ్యాంకులకు కంతులు చెల్లించడం మానేశారు. బ్యాంకులు కూడా కొత్త రుణాల పంపిణీని నిలిపేసినట్లు తెలుస్తోంది.