ప్రజాకవి కాళోజీ నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొనియాడారు.
గద్వాలటౌన్, న్యూస్‌లైన్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొనియాడారు. శనివారం స్థానిక బాలభవన్‌లో కాళోజీ శత జయంతి సభ నిర్వహించారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహిత్య, సామాజిక, రాజకీయ వైతాళికుడు కాళోజీ అని పేర్కొన్నారు. పదవుల్లో ఉండి తెలంగాణకు అన్యాయం తలపెట్టిన నాయకులను, వారి హోదాలను సైతం లెక్కచేయకుండా నిలదీసి..ఎండగట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తుదిశ్వాస వరకు ఆయన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం అవిశ్రాంతంగా పోరాటం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాళోజీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అప్పుడే శత జయంతి ఉత్సవాలు అర్థవంతం అవుతాయన్నారు. కాళోజీ కలలు గన్న తెలంగాణ సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ పిలుపునిచ్చారు.
ఆయన తన కవిత్వంలో చెప్పిన విషయాలను జీవితంలో ఆచరించి చూపారన్నారు. బ్రిజేష్‌కుమార్ తీర్పు ఫలితంగా పాలమూరుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవచారి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భీమా ప్రాజెక్టు నుంచి అక్రమంగా సీమాంధ్రకు నీటిని తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఇక్బాల్‌పాష, గట్టు తిమ్మప్ప, వీరభద్రప్ప, మద్దిలేటి, ప్రభాకర్, మధుసూదన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.