breaking news
Naryana Rao
-
బహుముఖ ప్రజ్ఞాశాలి.. కాళోజీ
గద్వాలటౌన్, న్యూస్‌లైన్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొనియాడారు. శనివారం స్థానిక బాలభవన్‌లో కాళోజీ శత జయంతి సభ నిర్వహించారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహిత్య, సామాజిక, రాజకీయ వైతాళికుడు కాళోజీ అని పేర్కొన్నారు. పదవుల్లో ఉండి తెలంగాణకు అన్యాయం తలపెట్టిన నాయకులను, వారి హోదాలను సైతం లెక్కచేయకుండా నిలదీసి..ఎండగట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తుదిశ్వాస వరకు ఆయన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం అవిశ్రాంతంగా పోరాటం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాళోజీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అప్పుడే శత జయంతి ఉత్సవాలు అర్థవంతం అవుతాయన్నారు. కాళోజీ కలలు గన్న తెలంగాణ సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆయన తన కవిత్వంలో చెప్పిన విషయాలను జీవితంలో ఆచరించి చూపారన్నారు. బ్రిజేష్‌కుమార్ తీర్పు ఫలితంగా పాలమూరుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవచారి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భీమా ప్రాజెక్టు నుంచి అక్రమంగా సీమాంధ్రకు నీటిని తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఇక్బాల్‌పాష, గట్టు తిమ్మప్ప, వీరభద్రప్ప, మద్దిలేటి, ప్రభాకర్, మధుసూదన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
కాళోజి అంటేనే తెలంగాణ సమాజం
డిచ్పల్లి, న్యూస్‌లైన్: మనిషిని మనిషిగా గుర్తించే సమాజం ఏర్పడాలని ప్రముఖ ప్రజాకవి కాళోజి నారాయణరావు అనుక్షణం కోరుకున్నారని తెలంగాణ జేఏసీచైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యాయన శాఖ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ‘కాళోజి శతజయంతి సంబరాలు-ప్రస్థానం-సాహిత్య పరిమళం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కాళోజి గురించి మాట్లాడటమంటే యావత్ తెలంగాణ సమాజం గురించి మాట్లాడటమేనని అభిప్రాయపడ్డారు. మానవతా విలువలు, వ్యక్తి శ్రేయోవాదంతో కూడిన కాళోజి ఆలోచనలు, కవిత్వం తెలంగాణ ఉద్యమాన్ని విపరీతంగా ప్రభావితం చేశాయన్నారు. ఆయన బాల్యం నుంచే తిరుగుబాటును ప్రకటించారన్నారు. పోరాట ప్రవృత్తిలో గాంధేయ విధానాలు ఆయనను ప్రభావితం చేశాయని విశ్లేషించారు. ఆధిపత్య భావనలపై తిరుగుబాటు చేసే విషయంలో ప్రహ్లాద పాత్రను కాళోజీ ఆదర్శవంతంగా తీసుకున్నారన్నారు. ఆనాటి మరాఠీ, బ్రిటిషు పాలిత ప్రాంతాలలో జరిగిన జాతీయోద్యమం కాళోజీని బాగా ప్రభావితం చేసిందన్నారు. ఆయన జీవితంలోని వివిధ సంఘటనలను ఆయన ఆసక్తికరంగా వివరించారు. అనంతరం కోదండరాంను తెయూ తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ మాజీ డెరైక్టర్ డాక్టర్ వెలిచాల కొండల్రావు, ఓయూ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య, మానవ హక్కుల ఉద్యమకర్త జీవన్‌రావు, తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి, ప్రిన్సిపాల్ ధర్మరాజు, మాజీ రిజిస్ట్రార్లు శివశంకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.