నరకయాతన | Power supply stop Lift in Samalkot Junction Railway Station | Sakshi
Sakshi News home page

నరకయాతన

Oct 8 2014 12:41 AM | Updated on Sep 2 2017 2:29 PM

నరకయాతన

నరకయాతన

లిఫ్ట్‌లో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 12 మంది ప్రయాణికులు సామర్లకోట రైల్వే స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు నానా అవస్థలూ పడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

సామర్లకోట : లిఫ్ట్‌లో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 12 మంది ప్రయాణికులు సామర్లకోట రైల్వే స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు నానా అవస్థలూ పడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో సామర్లకోట చేరింది. అందులోనుంచి కాకినాడకు చెందిన 12 మంది ప్రయాణికులు దిగారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫారానికి వెళ్లేందుకు.. వారు మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న లిఫ్ట్ ద్వారా ఓవర్‌బ్రిడ్జి పైకి చేరారు. అక్కడ నుంచి కిందకు దిగేందుకు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న లిఫ్ట్ ఎక్కారు. అది కిందకు దిగుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి, మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోయింది.
 
 దీంతో అందులో ఉన్నవారు హడలెత్తారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అరగంట తరువాత అక్కడకు చేరుకున్నారు. సుమారు 30 నిమిషాలపాటు ప్రయత్నించి గేట్లు తెరచి, లిఫ్ట్ పైభాగంలో ఓపెన్ చేశారు. దీంతో లోపలికి గాలి, వెలుతురు ప్రసరించడంతో ప్రయాణికులు ఉపిరి పీల్చుకున్నారు. 10.40 గంటల సమయానికి వారిని లిఫ్ట్ పైభాగం నుంచి సిబ్బంది బయటకు తీశారు. తాగునీరు, ఆహారం అందజేశారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులకు రైల్వే డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. స్టేషన్ మేనేజర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఆర్పీఎఫ్ ఎస్సై రవిశంకర్‌సింగ్‌లు ప్రయాణికుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
 
 ఇది నిర్లక్ష్యమే..
 సామర్లకోట స్టేషన్‌లో నెల రోజుల క్రితం కూడా ఇదేవిధంగా లిఫ్ట్ నిలిచిపోయింది. మళ్లీ అటువంటి సంఘటనే చోటుచేసుకుందని, రైల్వే అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఈ సందర్భంగా ప్రయాణికులు ఆరోపించారు. నిలిచిపోయిన లిఫ్ట్‌లో గుండె జబ్బు ఉన్నవారుంటే పరిస్థితి ఏమిటని కాకినాడకు చెందిన జ్యోతి, హరిక, నిర్మల, శ్రీదేవి,  మోహినీ, చరణ్‌తేజ్, అభిషేక్, ఎస్.శ్రీనివాసులు ప్రశ్నించారు. చిన్న పిల్లలతో లిఫ్ట్ ఎక్కామని, రెండు గంటల పాటు నరకయాతన అనుభవించామని చెప్పారు. అద్దాలతో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే గమనించి, తక్షణ చర్యలు తీసుకునే వీలుంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
 ప్రైవేటు ఆస్పత్రిలో జారిపడిన లిఫ్ట్
 కాకినాడ క్రైం : కాకినాడ టూటౌన్ నూకాలమ్మ గుడి సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లిఫ్ట్ మూడో అంతస్తు నుంచి అకస్మాత్తుగా జారిపడింది. అందులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఐదో అంతస్తులో ఉన్న ఆస్పత్రి యజమాని ఇంట్లో పూజా కార్యక్రమానికి ఆస్పత్రి సిబ్బంది మంగళవారం రాత్రి వెళ్లారు. అనంతరం కిందకు దిగేందుకు ఐదుగురు లిఫ్ట్ ఎక్కారు. మూడో ఫ్లోర్‌లో మరో పదిమంది కూడా ఎక్కారు. వాస్తవానికి అందులో ఆరుగురు మాత్రమే ఎక్కే వీలుంది. అయితే రోగులను స్ట్రెచర్‌తో తీసుకెళ్లేందుకు వీలుగా లోపల విశాలంగా ఉండడంతో సామర్థ్యానికి మించి జనం ఎక్కారు. అంత బరువు తట్టుకోలేక లిఫ్ట్ రోప్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో అది మూడో అంతస్తు నుంచి అమాంతం కిందకు జారి పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా, మరికొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు లేకపోవడంతో దీనిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement