
రాజకీయ రాణులు
నిన్న మొన్నటి వరకు మహిళలు వంటింటి కుందేళ్లన్న అపవాదు ఉండేది
* 50 శాతం రిజర్వేషన్‌తో శాసించే స్థాయికి
* యలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ పీఠాలు వారివే
* 39 ఎంపీపీ స్థానాల్లో 21 మంది మహిళలు
* 39 జెడ్పీటీసీల్లో 20..
విశాఖ రూరల్: నిన్న మొన్నటి వరకు మహిళలు వంటింటి కుందేళ్లన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు ఆ మహిళలే నిర్ణయాత్మక శక్తులుగా ముద్ర వేసుకుంటున్నారు. రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్‌తో శాసించే స్థాయికి ఎదిగారు. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికలే ఇందుకు నిదర్శనం. జిల్లా పరిషత్ నుంచి మున్సిపాలిటీల వరకు అన్ని పీఠాలను మహిళా నేతలే అధిరోహించారు.
స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీంతో మునుపెన్నడూలేని విధంగా మున్సిపాలిటీల్లోనే కాకుండా పరిషత్ ఎన్నికల్లో సైతం సగం స్థానాలు మహిళలకే దక్కాయి. ప్రాతినిథ్యంలోనే కాకుండా ఓటర్ల విషయంలో కూడా మహిళలే అధికంగా ఉండడం విశే షం. సర్పంచ్‌ల నుంచి జిల్లా పరిషత్ వరకు అన్నింటిలోను 50 శాతం మహిళలే ఉన్నారు. ఎన్నికల ప్రచార విషయంలో కూడా పురుషులకు దీటుగా మహిళలు దూసుకుపోయారు.
రాజకీయాల్లో రాణించడానికి ఎన్నికలప్పుడు ఎండ, వానలను లెక్కచేయకుండా రాత్రి పగలు కష్టపడ్డారు. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో సగం వార్డు సభ్యులతో పాటు రెండు చైర్‌పర్సన్ పీఠాలపై మహిళలే కూర్చున్నారు. నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, యలమంచిలి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలో ఉన్న 39 జెడ్పీటీసీల్లో 20, 656 ఎంపీటీసీల్లో 328 స్థానాల్లో మహిళలు గెలుపొందారు. 39 ఎంపీపీ స్థానాల్లో 21 మహిళలకు దక్కాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం కూడా లాలం భవానిని వరించింది.
మహిళల రాజ్యం : జిల్లాలో స్థానిక సంఖ్యలో మహిళల రాజ్యం ప్రారంభమైంది. మహిళల పాలనలోనే జిల్లా నడవనుంది. వీరిలో మెజార్టీ శాతం విద్యాధికులే కావడం గమనార్హం. కొంత మంది ఉన్నత ఉద్యోగావకాశాలు, అయిదంకెల జీతాలను వదులుకొని మరీ స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పారు. వీరిలో చాలా మందికి రాజకీయంగా విశేష అనుభవం లేకపోయినప్పటికీ.. ఇప్పటికే కొలువు తీరిన స్థానాల్లో తమదైన ముద్ర వేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయ చతురత తెలియకపోయినా.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. అయిదేళ్లలో వీరు జిల్లాను ఏ విధంగా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.