పరిశీలన పేరిట హైడ్రామా

Political Leaders Visit Strong Rooms in Visakhapatnam - Sakshi

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు వెళ్లిన రాజకీయ పార్టీ, మీడియా ప్రతినిధులు

అనుమతిచ్చేది లేదంటూ తెగేసి చెప్పిన బీఎస్‌ఎఫ్, సివిల్‌ పోలీస్‌ అధికారులు

రెండు గంటల పాటు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్దే పడిగాపులు

చివరకు అనుమతించిన భద్రతా బలగాలు

సీల్‌ వేసిన మూడు స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

సర్వలెన్స్‌ కెమెరాలో అన్ని కేంద్రాల పరిశీలన

ప్రతినిధులంతా సంతృప్తి వ్యక్తం చేశారని డీఆర్‌వో ప్రకటన

తహసీల్దార్ల స్థానంలో డీటీల నియామకంపై వివరణ ఇవ్వని అధికారులు

అధికారుల తీరును సమర్ధించడం లేదన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు

ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటన

సాక్షి, విశాఖపట్నం: ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంల భద్రతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను తీసుకెళ్లారు. సీల్‌ వేసిన మూడు నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌లను చూపించారు. ‘‘ఈవీఎం ఆ..భయం’’అనే శీర్షికన భద్రత డొల్లతనంపై ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఎన్నికల కమిషన్‌ కూడా తీవ్రంగాస్పందించింది. భద్రత విషయంలో తీసుకుంటు న్న చర్యలపై ఈసీ కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆరా తీసినట్టుగా తెలియవచ్చింది. రౌండ్‌ ది క్లాక్‌ భద్రతను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లను బదులు డిప్యూటీ తహసీల్దార్లను నియమించడంపై కూడా వివరణ కోరినట్టు సమాచారం. కాగా ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో స్ట్రాంగ్‌ రూమ్‌లను జేసీ–2 వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌.గున్నయ్యల నేతృత్వంలో ఆదివారం సాయంత్రం స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలనకు తీసుకెళ్లారు. కానీ అక్కడ విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్, సివిల్‌ పోలీసులు స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు అనుమతించలేదు. స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రత విషయంలో పలు అపోహలు తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ ఆదేశించారని, పరిశీలనకు అనుమతించాలని కోరారు. తమ పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. లోపలకు అనుమతించే ప్రసక్తే లేదని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎస్‌ఎఫ్, సివిల్‌ పోలీస్‌ అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు రెండు గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

ఇక అనుమతులు రావన్న భావనతో చాలా మంది మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు వెనుదిరిగి వెళ్లిపోయారు కూడా. చివరకు ఉన్నతాధికారుల ద్వారా ఆదేశాలు వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు భద్రతా బలగాలు అనుమతిచ్చాయి. సీల్‌ వేసిన నర్సీపట్నం, యలమంచలి, అనకాపల్లి నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌లను చూపించి.. మిగిలిన నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లపై సీసీ కెమెరాల ద్వారా ఏ విధంగా పర్యవేక్షిస్తున్నదీ జేసీ–2, డీఆర్‌వోలు వివరించారు. చివరగా ఈవీఎంల భద్రత విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులే ప్రకటించారు. కానీ ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్ల స్థానంలో డీటీల నియామకంపై మాత్రం పెదవి విప్ప లేదు. స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన వారిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, సీపీఐ నగర కార్యదర్శి డి.లోకనా«థం, టీడీపీ, బీజేపీ నాయకులు పళ్ల రమణ, విజయానందరెడ్డి, డీవైఎఫ్‌ఐ నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పటిష్టమైన భద్రత కల్పించాం
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌.గున్నయ్య తెలిపారు. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది రౌండ్‌ ది క్లాక్‌ భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు.

భద్రత విషయంలో అనుమానాలున్నాయి... వైఎస్సార్‌సీపీ నేతలు పక్కి, తుళ్లిఎన్నికల కౌంటింగ్‌ వరకు భద్రతా ఏర్పాట్లపై పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ అన్నారు. ఈవీఎంలు ఉన్న బాక్స్‌లు ఆరు బయట ఉండడంపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించిన జిల్లా ఎన్నికల అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల్సింది పోయి.. అన్ని సర్దుకున్న తర్వాత సాయంత్రం రాజకీయపార్టీలు, మీడియా ప్రతినిధులను పిలి పించి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్టుగా చూపిం చడం సరికాదన్నారు. అధికారుల తీరును సమర్ధించడం లేదని, ఖండిస్తున్నామని చెప్పుకొచ్చా రు. భద్రత విషయంలో తమకు కూడా పలు అనుమానాలున్నాయని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల అధికారులు అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించా ల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ నగర కార్యదర్శి లోకనాథం అన్నారు. రౌండ్‌ ది క్లాక్‌ భద్రతను జిల్లా అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top