ప్రమాదాల జోరుకు కళ్లెం..! 

Police Department Take Steps To Reducing Road Accidents In vizianagaram - Sakshi

ప్రమాదాల జోరుకు కళ్లెం వేసేందుకు పోలీస్‌ శాఖ ‘స్పీడ్‌గన్‌’లను ఎక్కుపెట్టింది. జాతీయ, ప్రధాన రోడ్లలో వేగంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి ఇ–చలానాలతో ఆర్థిక భారం వేయనుంది. మార్పురాకుంటే వాహనదారుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనుంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డు నిబంధనలను కఠినతరం చేసింది.  

సాక్షి, విజయనగరం టౌన్‌ : అతివేగం ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రాణాలు తీస్తోంది. పోలీస్‌ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అపరాధ రుసుం వసూలు చేస్తున్నా చాలామంది వాహనచోదకుల్లో మార్పురావడం లేదు. రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. ప్రమాదాలకు కారణమవుతూ ఎదుటివారి ప్రాణాలను హరిస్తున్నారు. దీనిని నివారించేందుకు పోలీస్‌ శాఖ సిద్ధమైంది. అతివేగంగా వాహనాలు నడిపే వారికి కళ్లెంవేసే చర్యలు చేపట్టింది. స్పీడ్‌ గన్‌తో వాహన వేగాన్ని లెక్కించి మితిమీరితే కొరడా ఝుళిపించనుంది. ఇటీవల పోలీస్‌ అధికారులు జిల్లాకు నాలుగు స్పీడ్‌ కంట్రోల్‌ లేజర్‌ గన్స్‌ను తెప్పించారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అతివేగంగా వచ్చే వాహనాల ఫొటో తీసి డాప్లర్‌ సిద్ధా్దంతం ఆధారంగా స్పీడ్‌ లేజర్‌ గన్‌ పరికరంతో వేగాన్ని లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే  ఇ–చలానా ద్వారా ఇంటివద్దకే జరిమానా రసీదులు పంపిస్తారు.

గాలిలో కలుస్తున్న ప్రాణాలు
అతివేగంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 454 ప్రమాదాలు సంభవించారు. ఇందులో  157 మంది వరకు మృత్యువాత పడ్డారు. 758 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో టూ వీలర్స్‌ ప్రయాణికులు 179 మంది ఉంటే ఆటోల్లో ప్రయాణించేవారు 77 మంది, కారులు, జీపుల్లో ప్రయాణించేవారు 85 మంది, బస్సుల ద్వారా 30మంది,  ట్రక్‌లు, ట్రాక్టర్స్‌  ద్వారా 96 మంది, ఇతర వాహనాల వల్ల 17 మంది వరకు  రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వీటిని నివారించేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాలో  ఉన్న ప్రధాన హైవేలను, ప్రమాదకర స్థలాలను గుర్తించింది. భోగాపురం హైవే, విశాఖ హైవే, గజపతినగరం హైవే, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ గన్‌లను ఏర్పాటు చేసింది. ఎక్కువగా ప్రమాదాలు హైవేలపైన జరుగుతుండడంతో వాటిపైన దృష్టిసారించింది. పట్టణంలో స్పోర్ట్స్‌ బైక్‌లు వాడే విద్యార్థులు, రైడర్లతో ప్రయాణికులు భయపడుతున్నారు. వారిని గుర్తించేందుకు లేజర్‌గన్‌ను ఏర్పాటుచేశారు. అటువంటి వారికి చలానాతో పాటు శిక్ష కూడా వేసే అవకాశాలున్నాయని పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు.

స్పీడ్‌కి బ్రేక్‌... 
స్పీడ్‌ గన్‌తో వాహనాలు మితిమీరిన వేగానికి చెక్‌ పడే అవకాశం ఉంది. కేవలం 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని బోర్డులు చూపిస్తున్నా వంద కిలోమీటర్ల స్పీడ్‌లో వాహనాలు నడుపుతారు. జాతీయరహదారులపై అయితే కార్లు, లారీలు అతివేగంతో వెళ్తే  స్పీడ్‌గన్‌తో దాన్ని వేగాన్ని లెక్కించి ఇ–చలాన్‌ ద్వారా ఇంటివద్దకే జరీమానాలు పంపుతారు. 14 కంటే ఎక్కువ జరీమానాలు పడిన వ్యక్తులు డబ్బులు చెల్లించకుంటే పోలీసులు సంబంధిత వాహన యజమానులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. జరిమానా మొత్తంతో పాటు పెనాల్టీ కడితేనే వదిలిపెడతారు.

నిబంధనలు పాటించాలి
వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల్సిందే. ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలనే విషయం సైన్‌ బోర్డులపై ఉంటుంది. ఆ వేగానికి మించి వెళ్తే స్పీడ్‌గన్‌ల ద్వారా ఇ–చలానా రూపంలో జరిమానాలు విధిస్తాం. మితిమీరిన వేగం ప్రమాద కరం. దీనివల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోగొట్టుకునే  ప్రమాదముంది. వాహన పత్రాలు, లైసెన్సులు లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయవద్దు.  ప్రస్తుతం జాతీయరహదారిపై స్పీడ్‌గన్‌లు ఏర్పాటుచేశాం.
– బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top