ప్రాణాలు తీసిన రసాయనం!

Poisonous chemical taken the life in Visakha - Sakshi

విశాఖ శివార్లలో విషాదం 

సాక్షి, విశాఖపట్నం/గాజువాక : చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే కుటుంబాల్లో విప్పసారా రూపంలోని  విషపూరిత రసాయనం తీవ్ర విషాదం నింపింది. ఎప్పట్నుంచో నిషాకు అలవాటుపడిన ఆ బడుగు జీవులు తాము సేవిస్తున్నది విషమని గమనించలేకపోయారు. రోజంతా కష్టపడ్డ శ్రమను గుక్కెడు సారాతో మరచిపోవచ్చని భావించారే తప్ప అది తమను శాశ్వత నిద్రలోకి తీసుకెళ్తుందని ఊహించలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇంకో 11మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. విశాఖ నగర శివారు పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్‌ ఎస్టీ కాలనీలో చోటుచేసుకున్న ఈ విషాదంపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

స్వతంత్రనగర్‌ ఎస్టీ కాలనీకి చెందిన వారు చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తుంటారు. ఎప్పటిలాగే కాలనీకి చెందిన వాడపల్లి అంకమ్మ శనివారం సాయంత్రం సమీపంలోని డంపింగ్‌ యార్డుకు చిత్తు కాగితాల కోసం వెళ్లింది. అక్కడ తుప్పల మాటున నల్లని ప్లాస్టిక్‌ డబ్బా (20 లీటర్ల సామర్థ్యం) కనిపించడంతో దాని మూతతెరచి వాసన చూసింది. విప్ప సారాగా భావించి ఆ డబ్బాను ఇంటికి తీసుకొచ్చింది. రాత్రి తన మామ వాడపల్లి అప్పడు (75), అతని చెల్లెలు పెండ్ర అప్పాయమ్మ (70)లకు ఇచ్చి ఆమె కూడా తాగింది. సమీప బంధువులు ఆసనాల కొండోడు, ఆసనాల చిన్నారావు, ఆసనాల రమణమ్మ, పెండ్ర లోవరాజు సహా మరో 20 మంది వరకు ఇచ్చింది. వారంతా రాత్రి తాగి నిద్రించారు. వీరిలో కొందరు వాంతులు చేసుకున్నారు. ఉదయానికి పెండ్ర అప్పాయమ్మ మృతి చెందింది. ఈమె అనారోగ్యంతో చనిపోయిందనుకుని దహన సంస్కారాలు కూడా పూర్తి చేసేశారు.

ఆ కాసేపటికి అప్పడు కూడా చనిపోయాడు. ఆందోళనతో కాలనీ వాసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వీరిలో అంకమ్మను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి, కొండోడుతో పాటు మిగతా వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యంలో కొండోడు కూడా మరణించాడు. వీరిలో ఆసనాల రమణమ్మ, ఆసనాల చిన్నారావుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆదివారం రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం కేజీహెచ్‌ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 11కి చేరింది. 

ఆ రసాయనాన్ని కొన్నారా?
ఈ ఘటనలో రసాయన డబ్బా దొరకడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాగుడు అలవాటు ఉన్న కాలనీ వాసులు మద్యంతో పాటు మత్తెక్కించే ద్రావణాలను రహస్యంగా సేవిస్తారని తెలుస్తోంది. తనకు డంపింగ్‌ యార్డులో రసాయన డబ్బా దొరికిందని, అది విప్ప సారాగా భావించి తీసుకొచ్చానని కాలనీ వాసులకు అంకమ్మ చెప్పింది. అయితే, దీనిని తాగిన మరికొందరు బాధితులు తాము వంద రూపాయల చొప్పున కొనుగోలు చేశామని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులతో పాటు కేజీహెచ్‌ వైద్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంకమ్మ చెబుతున్నట్టు డంపింగ్‌ యార్డులో దొరికిందా? లేక కొన్నాళ్లుగా ఎవరైనా కాలనీ వాసులకు విప్పసారా పేరిట మత్తునిచ్చే ఇతర ద్రావణాలను తెచ్చి విక్రయిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. 

పరీక్షకు రసాయనం..
కాగా, ఎక్సైజ్‌ అధికారులు ఆ ద్రావణాన్ని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. ఆదివారం రాత్రి వరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అది పరిశ్రమలకు వినియోగించే నాన్‌పోటబుల్‌ కెమికల్‌గా తేల్చారు. పూర్తిస్థాయి నివేదిక సోమవారం వస్తుందని ఎక్సైజ్‌ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మద్యంలో పోటబుల్‌ లిక్కర్‌ను మాత్రమే వాడతారని తెలిపారు. 

బాధితులకు పరామర్శ
స్వతంత్రనగర్‌ ఎస్టీ కాలనీని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య, వైఎస్సార్‌సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఏసీపీ ప్రవీణ్‌కుమార్, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌లు సందర్శించారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్‌ కె.భాస్కర్, ఎక్సైజ్‌ డీసీ టి.శ్రీనివాసరావు తదితరులు  పరామర్శించారు. 

ఈ రసాయనం ప్రాణాంతకమైనదే..
బాధితులు సేవించినది స్పిరిట్‌లాంటి ప్రాణాంతక రసాయనంగా భావిస్తున్నాం. ఇందులో మత్తు కలిగించే ఆల్కహాల్‌ కూడా ఉండడంవల్ల దీనిని సేవించిన వారికి కిక్కు ఇస్తుంది. ఇలాంటి రసాయనాలు పరిశ్రమల్లో వాడతారు. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసి దీనిని తాగామని బాధితులు చెబుతున్నారు. మత్తు, న్యూరో వైద్యులతో నిరంతర వైద్యం అందిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. 
    – డా. జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top