గేట్లకు తూట్లు

pincha Project Gates Damaged YSR Kadapa - Sakshi

పింఛా ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడ

తుప్పు పట్టిన గేట్లు

నీరు వృథా ఆందోళనలో రైతులు

కడప సిటీ : టి.సుండుపల్లె మండలంలోని ఆదినారాయణరెడ్డి పింఛా ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గేట్లు తుప్పుపట్టి నీళ్లు వృథాగా పోతున్నా పునరుద్ధరణ పనులు జరగక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గేట్ల లీకేజీ కారణంగా పొలాలకు ఏ మాత్రం ఉపమోగం లేకుండా నీరు పోతోంది. అధికారులు మాత్రం రూ.2.90 కోట్లతో నీరు–చెట్టు నిధుల కింద గేట్ల పునరుద్ధరణకు టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు చేపడుతామని చెబుతున్నారు. కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయలేదన్న విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.

చెయ్యేరులో కలుస్తున్న నీరు
ఈ ప్రాజెక్టును 1962లో నిర్మించారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిర్మాణం చేపట్టారు. నీటి సామర్థ్యం 0.327 టీఎంసీలు. మూడు వర్టికల్, రెండు స్వే్కర్‌ గేట్లు ఉన్నాయి. గేట్లు తుప్పు పట్టడం వల్ల రోజూ 10 క్యూసెక్కులు నీళ్లు వృథాగా పోయి చెయ్యేరులో కలుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చినా.. గేట్ల లీకేజీ కారణంగా వృథాగా పోతున్నాయని వారు వాపోతున్నారు.

గేట్ల పునరుద్ధరణపై జాప్యం
పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులు మొదటి నుంచి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ పనులకు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి మంత్రి సునీతా లక్ష్మారెడ్డి శిలాఫలకం వేసి వెళ్లారు. పలు కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడంతో సమస్య అలాగే ఉండి పోయింది. మళ్లీ గతేడాది డిసెంబర్‌లో ఈ గేట్ల పునరుద్ధరణకు నీరు–చెట్టు పథకం కింద రూ.2.90 కోట్లు కేటాయించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. టెండర్లను స్వప్న ఇన్‌ఫ్రా కంపెనీ దక్కించుకుంది. అగ్రిమెంటు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో గేట్ల పునరుద్ధరణ పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వర్షం వస్తే..
టీడీపీ ప్రభుత్వం ఈ పనులను చిత్తశుద్ధితో చేపడుతుందన్న నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతోంది. అందుకు నిదర్శనం టెండర్లు పిలిచి 9 మాసాలు అయినా పనులు ప్రారంభం కాకపోవడమే. ఈ నేపథ్యంలో ఒక వేళ ఈ మధ్యలో వర్షాలు బాగా పడి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చి చేరితే పనులు మొదలు పెట్టే అవకాశం ఆమడ దూరంలో ఉండక తప్పదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి త్వరలో పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు మొర పెట్టుకుంటున్నారు.

పనులు చేపట్టేందుకు చర్యలు
పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులను త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు– చెట్టు పథకం కింద రూ.2.90 కోట్ల నిధులు ఈ పనులకు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పూర్తయ్యాయి. స్వప్న ఇన్‌ఫ్రా కంపెనీతో అగ్రిమెంట్‌ పూర్తయింది. పనులను ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చాం.     – శ్రీనివాసులు,ఎస్‌ఈ, మైనర్‌ ఇరిగేషన్, కడప

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top