పెదబాబు డైరెక్షన్.. చినబాబు కలెక్షన్

పెదబాబు డైరెక్షన్.. చినబాబు కలెక్షన్ - Sakshi


ప్రభుత్వం పనికిరాదని పచ్చపత్రికే చెప్పింది

వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి


  

విడవలూరు: రాష్ట్రంలో ఉన్న పెదబాబు (చంద్రబాబు) డైరెక్షన్ చేస్తుంటే చిన్నబాబు (లోకేష్) కలెక్షన్లు చేస్తున్నాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరుజిల్లా విడవలూరు మండలం అలగానిపాడులోని వైఎస్సార్సీపీ నేత గండవరపు వివేకానందరెడ్డి నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని అనుకుంటారా అని దళితులను కించపరచిన బాబు మళ్లీ నేడు మురికివాడలో పుడితే మురికి ఆలోచనలే వస్తాయని అంటూ పేదలను హేళనగా మాట్లాడాడన్నారు. దీంతో దళితులు, నిరుపేదలపై చంద్రబాబు వైఖరి ఏంటో తెలుస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం నిరుపేదలే అన్న విషయం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. మహానేతలెందరో మురికివాడల నుంచి వచ్చినవారేనని గుర్తుచేశారు. చంద్రబాబులా మొదట రెండు ఎకరాలు కలిగి నేడు రూ. 3 లక్షల కోట్ల అవినీతి ఆస్తికి యజమానిగా ఎవరూ ఎదగలేదన్నా రు. కులాల మధ్య చిచ్చుపెడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నాడన్నారు.దళితులను, పేదవారిని కించపరచిన చంద్రబాబు వారి కాళ్లుపట్టుకుని క్షమాపణ అడగాలని వైఎస్సార్సీపీ తరపున ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళుతున్నట్లు చంద్రబాబు దుష్ర్పచారం చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లతో కొనాలని చూసి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడన్నారు. ఒకరిద్దరు ఎవరైనా చంద్రబాబు వలలో చిక్కి వెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైందని పచ్చపత్రికే ప్రచురించిందని గుర్తుచేశారు. అవినీతిలో ఈ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడే స్వయంగా ఇసుకలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొనడం గమనార్హమన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు గొల్లపల్లి విజయ్‌కుమార్, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, వివేకానందరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు అయ్యప్ప పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top