సరోగసీ పేరుతో చెలగాటం

Padmasri Hospital Running Sarogasi Illegal business Visakhaptnam - Sakshi

పద్మశ్రీ ఆస్పత్రి ఎదుట బాధితురాలు ఆందోళన

న్యాయం చేయాలని  మహిళా సంఘాల డిమాండ్‌  

అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగుచూసింది. బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... భర్తతో గొడవపడి మధురవాడలో తల్లి వద్ద ఉంటున్న నేతల నాగలక్ష్మికి అదే కాలనీకి చెందిన కిలాడి ఉష ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. నెల నెలా వృథాగా పోయే అండాలు తీసుకొని రూ.20వేలు ఇస్తారని అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. కాగితాలపై సంతకాలు చేయించిన తర్వాత ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారు. గంటున్నర తర్వాత నాగలక్ష్మికి తెలివి వచ్చాక ప్రశ్నించడంతో...

నీ కడుపులో రెండు పిండాలు పెట్టాం, 9 నెలలు మోయాలి, ఆ తర్వాత మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఆస్పత్రి డాక్టర్‌ సుధా పద్మశ్రీ రూ. 5వేలు నాగలక్ష్మి చేతిలో పెట్టింది. అనంతరం సెల్‌ఫోన్‌ లాక్కొని, ఆస్పత్రిలో నిర్బంధించారు. ఈ క్రమంలో బాధితురాలు అతికష్టంపై ఈ నెల 21న ఆస్పత్రి నుంచి తప్పించుకొని భర్త వద్దకు చేరుకొంది. తనకు జరిగిన అన్యాయంపై మహిళా సంఘాలతో కలసి అదే రోజు రాత్రి ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజులు గడిచినా ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ఎం.లక్ష్మి, ఎస్‌.వెంకటలక్ష్మి, యు.ఇందిర, ఈ.లక్ష్మి సాయంతో బాధితురాలి కుటుంబం బుధవారం పద్మశ్రీ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా సరోగసీ నిర్వహిస్తున్న ఆస్పత్రి నిర్వాహకులను అరెస్టు చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఐని నిలదీసిన మహిళలు
ఆస్పత్రి నుంచి తప్పించుకొని బయటపడిన బాధితురాలు నాగలక్ష్మి భర్తతో కలిసి ఫిర్యాదు చేయడానికి సోమవారం ఫోర్త్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించడంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సురేష్‌ నిర్లక్ష్యం వహించారని మహిళా సంఘాలు ఆరోపించాయి. అనారోగ్యంతో ఉన్న నాగలక్ష్మిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించకపోగా, మీరే తీసుకెళ్లండని నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీంతో మేమే ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆస్పత్రి ఎదుట జరిగిన ధర్నాకు విచ్చేసిన ఎస్‌ఐ సురేష్‌ను భాదిత మహిళ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు చుట్టుముట్టి నిలదీశారు.  మీ నిర్లక్ష్యం కారణంగా బాధితురాలికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఆమె ముగ్గురు పిల్లలను ఎవరు చూస్తారని ప్రశ్నించారు. సోమవారం ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top