రాజకీయం....ఆధ్యాత్మికం

Overview Of Peddapuram Constituency - Sakshi

మెట్ట ముఖ ద్వారం పెద్దాపురం

రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు, 41 గ్రామాలు ఉన్న ఏకైక నియోజకవర్గం 

సాక్షి, సామర్లకోట : మెట్ట ప్రాంతానికి ముఖద్వారమైన పెద్దాపురం నియోజకవర్గంపై ప్రతి ఒక్కరి కన్ను పడుతోంది. పాండవులు అజ్ఞాతవాసం సమయంలో నడయాడిన నేలగా పెద్దాపురానికి పేరు ఉంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి 1955లో మొదటి సారిగా ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుంది. పెద్దాపురం నియోజకవర్గానికి నలువైపులా ఒక వైపు కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, అనపర్తి నియోజకవర్గాలు ఉన్నాయి.ప్రస్తుతం 2019లో ఎన్నికలు జరుగుతున్నాయి.

భౌగోలిక స్వరూపం
291.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన  నియోజకవర్గంలో 
జనాభా:2,61,378
పురుషులు:  1,30,376
మహిళలు : 1,31,002
ఓటర్లు:  1,98,369

పురుషులు : 99,936
మహిళలు : 98,407
ఇతరులు :  17

పరిశ్రమలకు కోట
నియోజకవర్గంలోని సామర్లకోటలో రైల్వే స్టేషన్‌ – ఎదురుగానే బస్సు కాంప్లెక్స్‌ ఉన్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి సదుపాయం లేదు. పెద్దాపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద బస్సు కాంప్లెక్స్‌ ఉంది. రైల్వే స్టేషన్‌ సమీపంలో బ్రిటిష్‌వారి కాలంలో నిర్మించిన పంచదార పరిశ్రమ నేటికీ ఉంది. నవభారత్‌ వెంచర్స్‌ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ సాగుతోంది. నియోజకవర్గంలోని వాణిజ్య పంటలైన చెరకు నుంచి పంచదార తయారు చేస్తారు. మరో వాణిజ్య పంట దుంప నుంచి సగ్గు బియ్యం తయారు చేసే పరిశ్రమలు నియోజకవర్గంలో పది వరకు ఉన్నాయి.

వరి ప్రధాన పంట కావడంతో దానికి తగిన రీతిలో ధాన్యం మిల్లులు కూడా నియోజకవర్గంలో ఎక్కువ. తవుడు నుంచి నూనె తీసే పరిశ్రమలూ ఉన్నాయి. ఇటీవల కాలంలో పామాలిన్‌ తోటలపై రైతులు మక్కువ చూపడంతో సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డులో పామాలిన్‌ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేశారు. ఏడీబీ రోడ్డు ఏర్పాటు తరువాత ఈ రోడ్డు వెంబడి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రాక్‌ సిరామిక్స్, రిలయన్స్‌ పవర్‌ ప్లాంటు, జీవీకే పవర్‌ ప్లాంటు, అపర్ణ సిరామిక్స్‌ పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో సామర్లకోట మున్సిపాలిటీలో ప్రముఖ పుణ్యక్షేత్రమే శ్రీకుమారారామభీమేశ్వర ఆలయం ఉంది. మహాశివరాత్రి, కార్తికమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. 

ఆధ్మాత్మికంగానూ..
పెద్దాపురం మున్సిపాలిటీ ముఖ్య కూడలి ప్రదేశంలో మరిడమ్మ అమ్మవారి ఆలయం ఉంది. సామర్లకోటకు చెందిన చింతపల్లి వారి ఆడపడుచుగా చెబుతారు. ఈ ఆలయంలో ఏటా నెల రోజుల పాటు మరిడమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. పెద్దాపురానికి శివారులో జగ్గంపేట, రాజమహేంద్రవరం వెళ్లే రోడ్ల కూడలి ప్రదేశంలో పాండవుల మెట్ట ఉంది. పాండవులు అజ్ఞాత వాసం సమయంలో ఇక్కడ తల దాచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో పాండవులు రాజమహేంద్రవరం గోదావరి కాలువ వరకు ఏర్పాటు చేసుకున్న గృహ నేటికీ ఉంది. పెద్దాపురం మండల పరిధిలో కాండ్రకోట గ్రామంలొ వేంచేసిన నూకాలమ్మ ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్త అమావాస్య నుంచి నెల రోజుల ఆలయ వద్ద తిరునాళ్లు జరుగుతాయి. 

నియోజకవర్గాల పునర్విభజన
2014లో నియోజకవర్గాలను పునఃవిభజనతో అప్పటి వరకు సంపర నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రామాలు(సామర్లకోట మండలానికి చెందిన ) పెద్దాపురం నియోజకవర్గంలో కలిపారు. చంద్రంపాలెం, పవర, పండ్రవాడ, నవర, గొంచాల, అచ్చంపేట, పనసపాడు, పి.వేమవరం గ్రామాలను పెద్దాపురం నియోజకవర్గంలో కలిపారు. 
నియోజకవర్గం ఏర్పడిన సంవత్సరం : 1952
మొదటిసారిగా జరిగిన ఎన్నికలు : 1955
సామర్లకోట మున్సిపాలిటీ, మండల పరిధిలో గ్రామాలు : 18 
పెద్దాపురం మున్సిపాలిటీ, మండల పరి«ధిలో గ్రామాలు :  23
పోలింగ్‌ కేంద్రాలు : 211 
సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లు : 95
నియోజకవర్గంలో అక్షరాస్యత శాతం : 63.92
ప్రభుత్వ పాఠశాలలు : 160
ప్రైవేటు పాఠశాలలు : 89
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల : 1
ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు : 6
డీగ్రీ కళాశాలలు :5
బీఈడీ కళాశాలలు :3
ఇంజినీరింగ్‌ కళాశాలలు : 2  

ఇప్పటి వరకు 13 పర్యాయాలు జరిగిన సాధారణ ఎన్నికలలో ఏడు పర్యాయాలు స్థానికేతరులే విజయం సాధించారు.మిగిలిన ఆరు పర్యాయాలు స్థానికులు కైవసం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top