పొట్ట కూటి కోసం ఊరూరూ సైకిల్‌పై తిరుగుతూ టిఫిన్ అమ్ముకుని జీవనం సాగించే ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది.
వాహనం ఢీ - ఒకరి మృతి
Jan 20 2014 3:03 AM | Updated on Aug 30 2018 3:56 PM
బొండపల్లి, న్యూస్‌లైన్ : పొట్ట కూటి కోసం ఊరూరూ సైకిల్‌పై తిరుగుతూ టిఫిన్ అమ్ముకుని జీవనం సాగించే ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా.. టాటాఏస్ వాహనం పొట్టనబెట్టుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు. మండలంలోని గొట్లాం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొట్లాం గ్రామానికి చెందిన పసుమర్తి త్రినాథ(50) సమీప గ్రామాలకు సైకిల్‌పై టిఫిన్ తీసుకెళ్లి, అమ్ముతూ జీవనం సాగించేవాడు. రోజూ మాది రిగానే ఆదివారం జియ్యన్నవలస గ్రామంలో టిఫిన్ అమ్ముకుని తిరిగి స్వగ్రామం గొట్లాం వైపు సైకిల్ నడిపించుకుని వస్తుండగా.. జాతీయ రహదారిపై ఒడిశా నుంచి విజయనగరం వైపు అతివేగంగా వస్తున్న టాటాఏస్ వాహనం బలంగా ఢీకొంది. దీంతో త్రినాథ కొంతదూరం ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. త్రినాథను ఢీకొన్న అనంతరం అదే వాహనం అటుగా చెరువు నుంచి వస్తున్న గొట్లాం గ్రామానికి చెందిన చింతపల్లి నారాయణరావు, ఓల్ల సత్యంను ఢీకొంది. ఈ ఘటన లో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బొండపల్లి పోలీసులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు త్రినాథకు భార్యతోపాటు, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడివారిని కలిచివేసింది. ప్రమాద ఘటనపై ట్రెనీ ఎస్సై అశోక్‌కుమార్, ఏఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement