జూన్ 19న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు | On June 19, JEE Advanced Results | Sakshi
Sakshi News home page

జూన్ 19న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

May 26 2014 12:41 AM | Updated on Sep 2 2017 7:50 AM

రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, నెల్లూరు పట్టణాల్లో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు జూన్ 19న విడుదల కానున్నాయి.

హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, నెల్లూరు పట్టణాల్లో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు జూన్ 19న విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 99 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1.50 లక్షల మందికి అవకాశం కల్పించగా, రాష్ట్రంనుంచి సుమారు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాత పరీక్షలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, ఒకటి రెండు ప్రశ్నల్లో తప్పులు కూడా వచ్చాయని కొంతమంది విద్యార్థులు తెలిపారు. అయితే ప్రశ్నపత్రంలో తప్పులేమీ లేవని, కానీ 14 ప్రశ్నలకు ఒకే సమాధానం కాకుండా రెండు మూడు చొప్పున సమాధానాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. గణితంలో 3 ప్రశ్నలకు, ఫిజిక్స్‌లో 3 ప్రశ్నలకు, కెమిస్ట్రీలో 8 ప్రశ్నలకు రెండు మూడు చొప్పున సమాధానాలు ఉన్నట్లు తెలిపారు. కాగా ప్రశ్నపత్రం కీని వచ్చే నెల 1వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు పరీక్ష నిర్వాహక సంస్థలైన ఐఐటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఓఆర్‌ఎస్ షీట్లను జూన్ 8 నుంచి 11 వరకూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి, తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. అదేవిధంగా వచ్చేనెల 26న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. 29వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. జూలై 1న మొదటి దశ సీట్లు కేటాయించి 4వ తేదీలోగా ప్రవేశ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తారు. జూలై 7న రెండో దశ సీట్లు కేటాయించి 10వ తేదీ వరకూ ప్రవేశ ఫీజుకు గడువు ఇస్తారు. జూలై 9 నుంచి 11 వరకూ సీట్ల ఉపసంహరణకు, ఫీజు రీఫండ్ కు అవకాశం ఉంటుంది. మూడో దశ సీట్లను జూలై 13న కేటాయించి ప్రవేశ ఫీజు చెల్లింపునకు 14వ తేదీ వరకూ గడువు ఇస్తారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు ఒక్క హైదరాబాద్‌లోనే 12 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆదివారం ప్రారంభం అయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement