పార్వతీపురం పట్టణంలో పలు దేవాలయాల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. పాత బస్టాండులోని
పార్వతీపురం : పార్వతీపురం పట్టణంలో పలు దేవాలయాల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. పాత బస్టాండులోని పురాతన జగన్నాథస్వామి, సీతారామ స్వామి ఆలయాల స్థలాలను కబ్జాదారులు ఆక్రమించి బడ్డీలు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతం వ్యాపారాలకు అనువైనది కావడంతో ఇక్కడ స్థలాలకు డిమాండ్ పెరిగింది.
దేవాలయాలకు రాకపోకలు సాగించే తూర్పు, ఉత్తర ద్వారాలను సైతం కానరాకుండా నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా దేవాలయాలకు భక్తులు రావడం మానేశారని అర్చకులు వాపోతున్నారు. ఆయా కబ్జాదారుల అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖాధికారులు కూడా అండగా ఉండటంతో కబ్జాదారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డుపైకి జగన్నాథుని రథం..
దేవాలయ స్థలాల ఆక్రమణల ఫలితంగా ఆలయ ప్రాంగణంలో చాటుగా ఉండాల్సిన జగన్నాథుని రథం ఇప్పుడు మెయిన్ రోడ్డులో ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయా దేవాలయాలకు ఉత్తర ద్వారాలు లేక వాటి ద్వారా రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
తూర్పు, ఉత్తర ద్వారాలు ఆనవాయితీ...
ఆలయాలకు తూర్పు, ఉత్తర ద్వారాలు ఆనవాయితీ. తూర్పు ద్వారం గుండా భక్తులు ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారంలో బయటికి వెళ్తారు. అయితే ఆక్రమణల కారణంగా ఆరెండు ద్వారాలు లేకుండా పోయాయి. దీంతో ఇక్కడ ఆలయాలున్నాయన్న సంగతే భక్తులు మర్చిపోయారు.
-జగన్నాథ పండా,
ప్రధాన అర్చకులు, పార్వతీపురం
దారి లేకుండా చేశారు...
దేవాలయానికి రాకపోకలు సాగించేందుకు రహదారి సదుపాయం లేకుండా చేశారు. ఆలయ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. చుట్టూ షాపులే. ఆలయ ప్రాంగణంలో అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు.
-రమేష్ పండా, ఆలయ అర్చకులు, పార్వతీపురం
5న తొలగిస్తాం...
జగన్నాథస్వామి, సీతారామస్వామి ఆలయ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను వచ్చే నెల 5న పోలీసుల సహకారంతో తొలగిస్తాం. అనంతరం ఆయా దేవాలయాల స్థలాలకు రక్షణ కవచం ఏర్పాటు చేస్తాం. ఆలయాలకు తూర్పు, ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేసి రహదారి సదుపాయం కల్పిస్తాం.
-రోణంకి నాగార్జున, దేవాదాయశాఖ ఈఓ