స్పర్శ దర్శనం.. మహాభారం | Now In SriSailam Temple Sparshadarshnam Is Difficult | Sakshi
Sakshi News home page

స్పర్శ దర్శనం.. మహాభారం

Jun 24 2018 2:36 PM | Updated on Aug 28 2018 3:57 PM

Now In SriSailam Temple Sparshadarshnam Is Difficult - Sakshi

సాక్షి, శ్రీశైలం : వారణాసి(కాశీ), శ్రీశైలం మహాక్షేత్రంలో మాత్రమే మల్లికార్జునస్వామిని స్పర్శించి దర్శించుకునే భాగ్యం ఉంటుంది. భోళాశంకరుడైన శ్రీశైల శ్రీమల్లికార్జునస్వామికి శిరస్సు తాకించి కేవలం పిడికెడు విభూది, పాలు, నీళ్లు, పత్రి సమర్పిస్తే చాలు తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ భాగ్యాన్ని కూడా శ్రీశైలానికి వచ్చే సాధారణ భక్తులు నోచుకోలేక పోతున్నారు. మల్లన్న ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో సాధారణ భక్తులు మల్లన్న స్పర్శ దర్శనం శని, ఆది, సోమవారాలలో చేసుకోవడానికి వీలు లేకుండా అప్పటి ఈఓ భరత్‌గుప్త ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటూ మాత్రమే స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించారు.   


ఆదాయమే లక్ష్యంగా టికెట్ల పెంపుదల.. 
మల్లన్న ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో అధికారులు ఇష్టారీతిగా సేవాటిక్కెట్లను పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.  రెండేళ్ల క్రితం వరకు గర్భాలయ అభిషేకం రూ.1000, ముందస్తు అభిషేకం రూ.1500గా ఉండేది.  ఆ తర్వాత మల్లన్న గర్భాలయంలో అభిషేకానికి రూ.5000గా నిర్ణయించారు. సామూహిక అభిషేక టికెట్‌ను రూ.1500కు పెంచేశారు. అలాగే అమ్మవారి ఆలయ శ్రీచక్రం ముందు కుంకుమార్చన టికెట్టు ధర రూ.300, అడ్వాన్స్‌ టికెట్లు రూ.500 ఉండేది. వాటిని కూడా ఏకంగా రూ.1000కు పెంచేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగే రుద్ర, చండీహోమం టికెట్‌ ధరలు రూ.750గా ఉండేవి.

వాటిని ఏకంగా రెట్టింపు చేసి రూ.1500కు పెంచేశారు. కొన్నేళ్ల క్రితం వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పించే వారు. ఇప్పుడు రూ.500 వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్‌ తీసుకున్న వారికి మాత్రమే గర్భాలయంలోకి అనుమతించి స్పర్శ దర్శనం చేయిస్తున్నారు. ఆ టిక్కెట్ల్లను కూడా పరిమితి సంఖ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయం కూడా కేవలం ఉదయం 6.30 గంటలకు, మధ్యాహ్నం 12.30కు,  సాయంత్రం 6.30 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే దేవుడు దర్శనానికి క్షేత్రానికి వచ్చే భక్తులు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవా టికెట్లతో పాటు టోల్‌ గేట్‌  నుంచి టెంకాయల వరకు అధిక రేట్లు ఉండటంతో భక్తులు మండి పడుతున్నారు. 

కొత్త ఈఓ పాలనలో భక్తుల కష్టాలు తొలిగేనా.. 
ఇటీవల శ్రీశైలం ఈఓగా బాధ్యతలు చేపట్టిన  శ్రీరామచంద్రమూర్తి  సాధారణ భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రద్దీ లేని రోజుల్లోనైనా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం అందరికీ కల్పించాలని, రూ.5000 అభిషేకం టికెట్టు తీసుకున్న దంపతులతో పాటూ వారి వెంట ఉన్న పిలలు, వృద్ధులకు అవకాశం ఇవ్వా లని భక్తులు కోరు తున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలను అభిషేక సమయంలో తల్లిదండ్రులతో పాటూ అనుమతించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శని, ఆది, సోమవారాలు, ప్రముఖ పర్వదినాలను మినహాయించి మిగిలిన రోజుల్లో స్పర్శ దర్శ నంపై  ఈఓ దృష్టి సారించాలని కోరుతున్నారు.  రద్దీ రోజుల్లో వసతి గదుల కొరతతో ఇబ్బం దులు పడుతున్నారు. తక్కువ ధరతో గదులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.

కొబ్బరి కాయ రూ. 20 
భక్తులు స్వామిఅమ్మవార్లకు సమర్పించే  కొబ్బరకాయల ధరలను కూడా శ్రీశైలదేవస్థానం వారు ఇటీవలే రెండు మార్లు పెంచేశారు.  కొంతకాలం వరకు రూ.10గా ఉన్న ధర, రూ. 15, ప్రస్తుతం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు కుటుంబసమేతంగా వచ్చినా ఒక్క కొబ్బరికాయ మాత్రమే సమర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.    

మందులు కొనాల్సిందే..  
శ్రీశైలదేవస్థానం ఎన్నో ఏళ్లుగా భక్తులు, స్థానికుల సౌకర్యం కోసం ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసింది. కొంతకాలం క్రితం వరకు అందులో ఉచిత వైద్యంతో పాటూ మందులు కూడా దాతల సహకారంతో ఉచితంగానే అందజేసేవారు. ప్రస్తుతం మందులు లేక పోవడంతో రోగులు బయట  కొనుగోలు చేయాల్సి వస్తోంది.  

టోల్‌ బాదుడు..  
శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించడానికి  నిత్యం వేల సంఖ్యలో వివిధ వాహనాల ద్వారా చేరుకుంటున్నారు. అయితే టోల్‌ గేట్‌ టిక్కెట్‌ ధరలు కూడా భారీగా ఉన్నాయి. కారు, జీపు మొదలైన వాటికి రూ.100, టెంపో, ట్రాక్టర్, బస్‌ మొదలైన వాటికి రూ. 200,  లోడ్‌ బండ్లకు రూ.500 వరకు టోల్‌గేట్‌ రుసుము చెల్లించాల్సి వస్తోంది.  ఈ టోల్‌గేట్‌ ద్వారా దేవస్థానానికి నెలకు రూ.50 లక్షలకుపై గా ఆదాయం సమకూరుతున్నా వాహనదారులకు పార్కింగ్, తదితర విషయాల్లో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement