మాతా మన్నించు!
తిరుమల శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం దుస్థితికి చేరింది...
- జీర్ణోద్ధరణకు నోచుకోని వకుళామాత ఆలయం
- పట్టించుకోని టీటీడీ
- పాదయాత్రలు చేసి తిరిగి చూడని స్వామీజీలు
- ఆగని అక్రమ మైనింగ్
- కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
తిరుమల వేంకటేశ్వర స్వామి తల్లి వకుళామాత కోసం నిర్మించిన ఆలయానికే రక్షణ లేకుండా పోయింది. ఒకప్పుడు నిత్య ధూపదీపనైవేద్యాలతో విరాజిల్లిన ఈ కోవెలనేడు రూపురేఖలు కొల్పోతోంది. మాఫియా మాయగాళ్లు విగ్రహాన్నీ కనుమరుగు చేశారు. శతాబ్దాల నాటి దేవాలయం శిథిలావస్థకు చేరినా పట్టించుకునేవారు లేరు. జీర్ణోద్ధరణకు టీటీడీ అధికారులు చొరవచూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తిరుపతి రూరల్: తిరుమల శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం దుస్థితికి చేరింది. మైనింగ్ మాఫియా దాడికి ఆలయ రూపురేఖలు లేకుండా పోతున్నాయి. అధికారులు, టీటీడీ నిర్లక్ష్యం వల్ల ఆలయ జీర్ణోద్ధరణ పనులు ముందుకు సాగడం లేదు.
మొదట్లో ఆలయ పనులను అడ్డుకున్న స్థానికుల్లో తాజాగా మార్పు వచ్చినా పట్టించుకునే నాథుడే లేరు. తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయ దుస్థితిపై ప్రత్యేక కథనం..
చరిత్ర ఘనం
రాయలవారి కాలంలో 500 ఏళ్లక్రితం పేరూరు బండపై వకుళమాత ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో గంట మోగిన తర్వాతే తిరుమలలో తనకు నైవేద్యం పెట్టాలని శ్రీవారు చెప్పినట్లు పురాణాలు చెబుతుంటాయి.
రూ.కోటితో ఫెన్సింగ్
స్వామిజీలు, హిందూ సంస్థలు, భక్తుల డిమాండ్‌తో టీటీడీ కదిలింది. ఆలయం చుట్టూ 4.50 ఎకరాలను బఫర్ జోన్‌గా రెవెన్యూ అధికారులు నిర్థారించి టీటీడీకి అప్పగించారు. అందులో రూ.కోటితో టీటీడీ ఫెన్సింగ్ వేసింది. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తామని ప్రకటించింది.
స్థానికుల ఆగ్రహం
టీటీడీ, రెవెన్యూ అధికారుల చర్యలపై స్థానికులు మండిపడ్డారు. అసలు అది వకుళమాత ఆలయం కాదని కోర్టుమెట్లు తొక్కారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు.
స్వామిజీలు, హిందూ సంస్థల రంగప్రవేశం
స్థానికులు వ్యతిరేకించడంతో స్వామిజీలు, హిందూ సంస్థలు రంగప్రవేశం చేశాయి. కాకినాడ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కోసం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసే వరకు శ్రీవారిని దర్శించుకోనని ప్రతిజ్ఞ చేశారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆలయాన్ని సందర్శించడం, అయ్యో...అనడం నిత్యకృత్యమైంది.
ఆగని అక్రమ మైనింగ్
ఆలయం దుస్థితికి చేరిందని ఓ వైపు భక్తులు, హిందూ సంస్థలు మొత్తుకుంటున్నా ఆలయ పరిసరాల్లో అక్రమ మైనింగ్ ఆగనంటోంది. పట్టపగలే బండను కొట్టి రాళ్లను తరలిస్తున్నారు.


