సాధారణమే మేలు | Normal Delivery Best For Pregnet Women | Sakshi
Sakshi News home page

సాధారణమే మేలు

Jan 29 2019 8:29 AM | Updated on Jan 29 2019 8:29 AM

Normal Delivery Best For Pregnet Women - Sakshi

ఆసుపత్రిలో పురుడు పోసుకొని చిన్నారులతో ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బాలింతలు

మానవ శరీరం 45 డెల్స్‌ యూనిట్స్‌ నొప్పిని మాత్రమే భరించగదు.  కానీ గర్భిణి ప్రసవించే సమయంలో 57 డెల్స్‌ యూనిట్స్‌ బాధను భరిస్తుంది. సాధారణ భాషలో చెప్పాలంటే... ఒకేసారి 20 ఎముకలు పటపటా విరిగిపోతుంటే ఎంత బాధ వస్తుందో...అంత బాధను ఆ మాతృమూర్తి ఆ సమయంలో భరించాలి. అందుకే  పురిటినొప్పులా...ఇంకేముంది సిజేరియన్‌ చేసేద్దాం. వైద్యుల నోటి నుంచి వచ్చే మొదటి మాట అదే... గర్భి ణులు, వారి బంధువుల మనసులో మాట కూడా అదే. కానీ గత ఐదేళ్లుగా కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కౌన్సెలింగ్‌ ఫలితంగా గర్భిణులు కూడా సానుకూలంగా స్పందించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. 

కాకినాడ : సాధారణ ప్రసవమే పదికాలాల పాటు పదిలమని అన్నారు పెద్దలు. సిజేరియన్ల కంటే సాధారణ ప్రసవాలే మేలంటున్నారు వైద్యాధికారులు. ఆ సూచనలకు సానుకూల స్పందన వస్తుండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రి ప్రసూతి వార్డులో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సాధారణ కాన్పుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్స కాన్పులు అధికంగా జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించడానికి వివిధ పథకాలు రూపొందించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగింది.

సమస్యాత్మకమైతేనే శస్త్ర చికిత్స...
జిల్లా కేంద్రమైన కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణుల ప్రసవం కోసం వచ్చినా, జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌ నుంచి జీజీహెచ్‌కు గర్భిణులను తీసుకొచ్చినా సాధారణ కాన్పులు చేయడానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కాన్పు సమస్యాత్మకమైతే వెంటనే సమీపంలోని కాకినాడ జీజీహెచ్‌కు పంపిస్తున్నారు. ఇలాంటివారికి సైతం వైద్యం అందిస్తూ సాధారణ కాన్పులు చేయడానికే జీజీహెచ్‌ వైద్యులు ప్రాధాన్యతనిస్తున్నారు. నొప్పులు భరించలేని గర్భిణులు, లేదా విధి లేని పరిస్థితుల్లోనే శస్త్ర చికిత్స వైపు ఆలోచిస్తున్నారు. అందువల్లే జిల్లాలో కోత కాన్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత మూడేళ్లుగా కాకినాడ జీజీహెచ్‌లో 80 శాతం మందికి పైగా సాధారణ డెలివరీల వైపు మొగ్గు చూపించడం గమనార్హం.

సాధారణ కాన్పులతోనేప్రయోజనాలు...
సాధారణ ప్రసవాల్లో మహిళలు రెండు రోజుల్లోనే ఎప్పటిలానే తమ పనులను తాము చేసుకోడానికి వీలుంటుంది. ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు. గర్భసంచికి కూడా ఏ ప్రమాదం ఉండదు.గర్భాశయానికి ఎటువంటి వ్యాధులూ సోకవు. భవిష్యత్తులో ఎటువంటి రుగ్మతలకు గురికాకుండా ఆరోగ్యం గా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శస్త్ర చికిత్స కాన్పులతోనే ప్రమాదాలు
శస్త్ర చికిత్స చేసుకున్నవారిలో రెండో కాన్పు సమయంలో కుట్లు విడిపోయే ప్రమాదం ఉంటుంది.
గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో భవిష్యత్తులో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి వచ్చే అవకాశాలుంటాయి. రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో గర్భసంచి తొలగించే పరిస్థితి  తలెత్తవచ్చు.
తరచూ విరేచనాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. గర్భసంచి పక్కన ఉండే మూత్రాశయానికి కూడా ఇబ్బందులు ఏర్పడొచ్చు. దీంతో రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడొచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు.దాదాపు ఆరు నెలలపాటు బరువైన పనులు చేయడానికి వీళ్లేని పరిస్థితి.

సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా కేసులు వస్తుంటాయి. ప్రతి కాన్పును సాధారణంగా చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ ఆసుపత్రికి ఆందోళనకరంగా ఉండే కేసులే అధికంగా వస్తుంటాయి. పోషకాహారలోపంతో ఉన్న హైరిస్క్‌ కేసులు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో ప్రొఫెసర్‌ పోస్టులు, అసోసియేట్‌ వైద్య పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతోంది. హిమోగ్లోబిన్‌ శాతం చాలా తక్కువగా ఉండి అంటే 3, 4 శాతం ఉన్న హైరిస్క్‌ కేసులు, మొదటి ఆపరేషన్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకుని, రెండో కాన్పుకు జీజీహెచ్‌కు వస్తున్నాయి. ఇటువంటి హైరిస్క్‌ కేసులకు కూడా సాధారణ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సాధారణంగా ఒకసారి ఆపరేషన్‌ చేయించుకుంటే రెండోసారి సాధారణ డెలివరీ అయ్యేవారి శాతం తక్కువగా ఉంటుంది. గత మూడేళ్లుగా భారీగా శస్త్ర చికిత్సలు తగ్గాయి. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు వైద్య ఆరోగ్య సిబ్బందితో అవగాహన కల్పిస్తూ సాధారణ డెలివరీలను ప్రోత్సహిస్తున్నాం.– డాక్టర్‌ లావణ్య కుమారి,హెచ్‌వోడీ, ప్రసూతి విభాగం,  కాకినాడ జీజీహెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement