డోలీపై నిండు గర్భిణి తరలింపు

No way For Ambulance Services in Visakhapatnam Agency - Sakshi

గత పాలకుల నిర్లక్ష్యంతో రోడ్డు, రవాణా సౌకర్యాలు మృగ్యం

విశాఖపట్నం, పాడేరు రూరల్‌:  గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విశాఖ ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలు మృగ్యంగా మారాయి. దీంతో గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గర్భిణులు ప్రసవం కోసం, రోగులు చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా పాడేరు మండలం మారుమూల బడిమెల పంచాయతీ వల్లాయి గ్రామంలో ఓ గర్భిణిని కాన్పు కోసం ఆస్పత్రికి డోలీపై తరలించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వల్లాయి గ్రామానికి చెందిన సోమెలి సూర్యకుమారి అనే గిరిజన మహిళ తొమ్మిది నెలల గర్భిణి.

బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించడం అనివార్యమైంది. గ్రామానికి అంబులెన్స్‌ వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదు. చేసేది లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం పద్మ సహకారంతో డోలీపై మోస్తూ అడవి మార్గం గుండా సుమారు 7 కిలోమీటర్ల మేర ఉన్న బడిమెల వరకు తీసుకొ చ్చారు. అక్కడి నుంచి మినుములూరు పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రవీణ్‌ కుమార్, అంబులెన్స్‌ పైలెట్‌ బి.కొండబాబు సూర్యకుమారిని అంబులెన్స్‌లో మినుములూరు పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందించారు. దీంతో ఆమెకు ప్రాణపాయం తప్పింది. బుధవారం సాయంత్రం ఆమె మినుములూరు పీహెచ్‌సీలో పండంటి ఆడ శిశువును ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ  క్షేమంగా ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top