'ఏ మంత్రీ చదవకుండా తెలంగాణ నోట్ను ఎలా ఆమోదిస్తారు'

'ఏ మంత్రీ చదవకుండా తెలంగాణ నోట్ను ఎలా ఆమోదిస్తారు' - Sakshi


హైదరాబాద్ :  కేంద్ర కేబినెట్లో ప్రభుత్వం ఇచ్చిన నోట్ను ఏ మంత్రీ పూర్తిగా చదవలేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అంత పెద్ద నోట్ను ఏదో డిటెక్టివ్ కథలాగా వేగంగా అప్పటికప్పుడు చదవలేమని, అందుకు కొంత సమయం కావాలని కోరినట్లు చెప్పారు. కీలకమైన నోట్ను చదవకుండా రాష్ట్ర మంత్రివర్గం విభజనను ఎలా ఆమోదిస్తుందని కావూరి అన్నారు. తాను మాత్రం ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర విభజన తథ్యమని జీవోఎం స్పష్టం చేసిందని కావూరి చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సమస్య అంతా హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతమై ఉందని జీవోఎంకు చెప్పామన్నారు. హైదరాబాద్ను పదేళ్లు కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే రెండోవైపు అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పామన్నారు.  తాము ఎన్ని చెప్పినా... ఏం చేసినా... వారు ఒకే ప్రాంతానికే అన్నీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అయినా, విభజన అనివార్యమైతే ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు.తాము రాష్ట్ర విభజనను అడ్డుకోలేనందున తన మాటలను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు కావూరి చెప్పారు.  పదేళ్లపాటు హైదరాబాద్ నగరాన్ని యూటీ చేస్తే సీమాంధ్ర ప్రజలకు నచ్చజెప్పే ఆలోచన ఉండేదన్నారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేస్తే... మిత్రులుగా విడిపోయే అవకాశం ఉందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతమైన భద్రాచలం డివిజన్ను కోస్తాంధ్రలో కలపాలని కోరినట్లు కావూరి చెప్పారు. గతంలో భద్రాచలం కోస్తాంధ్రలో ఉండేదని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భద్రాచలంపై నిర్ణయం అత్యవసరమన్నారు. భద్రాచలాన్ని తెలంగాణకు ఇస్తే శబరి నుంచి వచ్చే నీటిని అడ్డుకునే అవకాశం ఉందన్నారు.అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు కావూరి తెలిపారు. రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందనుకుంటే తాను ఎప్పుడో రాజీనామా చేసేవాడినని ఆయన అన్నారు.  47 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు భయపడటం లేదన్నారు. ప్రజల శ్రేయస్సు కన్నా పార్టీ శ్రేయస్సు ముఖ్యమని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top