నో ఫిల్లింగ్! | Sakshi
Sakshi News home page

నో ఫిల్లింగ్!

Published Mon, Jul 21 2014 2:14 AM

నో ఫిల్లింగ్! - Sakshi

రాజంపేట: జిల్లాలోని అనేక పెట్రోల్ బంకులలో నోస్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి.  బంకుల యజమానులు డబ్బులు కట్టలేకకాదు..సరైన మోతాదులో పెట్రోలు..డీజిల్  దిగుమతి లేని పరిస్ధితులు  నెలకొంటున్నాయి.   జిల్లాలోని    సగానికిపైగా పెట్రోలు, డీజిల్ బంకుల్లో  ఈ పరిస్థితి నెలకొని ఉంది.
 
 జిల్లాలోని  రాజంపేట, కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల తదితర ప్రాంతాల్లో ప్రధానంగా మూడు కంపెనీలకు చెందిన బంకులను అధికసంఖ్యలో ఏర్పాటుచేశారు. నిత్యం లక్షలాది లీటర్లు బంకుల ద్వారా  సరఫరా అవుతోంది. హెచ్‌పీసీ(హిందూస్థాన్‌పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్), ఐఓసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), బీపీసీఎల్(భారత్‌పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా ఆయిల్ ఫిల్లింగ్‌స్టేషన్లను విరివిగా ఏర్పాటుచేశారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో చాలాచోట్ల లేదు..లేదు అన్న పదాలు వాహనదారులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి.  
 
 ఎందుకు ఇలా.....
 కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు  పెట్రోలు, డీజిల్ సరఫరాచేసేందుకు  జిల్లా కేంద్రంలోని కడప రైల్వేస్టేషన్ సమీపంలో ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీసీఎల్ డిపోలు ఒకేచోట ఉండేవి. రైల్వేతో ఉన్న 50 యేళ్ల అగ్రిమెంటుకు కాలపరిమితి ముగిసింది. దీని ఫలితంగా అక్కడి నుంచి డిపోలను మూసివేయాల్సిన పరిస్ధితులు ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. మూడు ప్రధానసంస్ధలు వేర్వేరుచోట్ల డిపోలను ఏర్పాటుచేసుకునేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా గుత్తిలో బీపీసీఎల్ డిపో ఏర్పాటు కాగా, చిత్తూరులో ఐఓసీ డిపోను ఏర్పాటుచేసుకుంది. భాకరాపేట వద్ద హెచ్‌పీసీఎల్ డిపో ఏర్పాటు పూర్తికావస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డిపోలోకి రైల్వేట్రాక్‌ను కూడా వేసుకున్నారు. త్వరలో ఈ డిపో వినియోగంలోకి రానున్నదని సమాచారం.  
 
 రాష్ట్ర విభజన ఎఫెక్ట్
 జిల్లాలోని  ఆయిల్ ఫిల్లింగ్‌స్టేషన్ల నిర్వహణ విషయంలో రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కనిపిస్తోంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సేల్‌ట్యాక్స్ పరంగా నెంబర్లు కూడా మారిపోనున్నాయి. ఇందువల్ల కొన్ని బంకుల యజమానులు కూడా ఫిల్లింగ్‌స్టేషన్ల నిర్వహణ విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న నెంబర్లు కాకుండా విభజన తర్వాత కొత్తగా సేల్‌ట్యాక్స్  నెంబర్లు వస్తాయి. పాతనెంబరు..కొత్తనెంబర్ల అంశంతో ఫిల్లింగ్‌స్టేషన్లకు సంబంధించి పన్ను వ్యవహారంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో కొంతమంది తమ ఫిల్లింగ్‌స్టేషన్లను ఖాళీగానే ఉంచుకున్నారు. కొత్తగా సేల్‌ట్యాక్స్ నెంబర్లతో తిరిగి పెట్రోలు, డీజల్ వ్యాపారాలు సాగించుకోవాలనే యోచనలో  ఉన్నారు.
 
 ఇతర డిపోల నుంచి..
 జిల్లాలో  ప్రస్తుతానికి చిత్తూరు, గుత్తి ,ఒంగోలు డిపోల నుంచి పెట్రోలు, డీజిల్‌ను  జిల్లాకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్ధితిలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు తీవ్రఅంతరాయం కలుగుతోంది. అంతేగాకుండా అదే స్ధాయిలో డిమాండ్‌కు కూడా ఏర్పడింది. బంకుల యజమానులు పెట్రోలు, డీజిల్‌కు డబ్బులు కట్టినా దిగుమతి ఆలస్యమవుతోంది. మరికొంతమంది బంకు యజమానులు పరస్పర సర్దుబాటుతో బంకులను నిర్వహిస్తున్నారు. కొందరైతే బంకులకు పెట్రోలు, డీజిల్‌ను దిగుమతి చేసుకోవడంలేదు. చాలాచోట్ల ఇదే పరిస్ధితులు ఉండటంతో బంకులు నిండుకున్నాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement