రాష్ట్రంలో రైతుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి పట్ల నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నిప్పులు చెరిగారు.
నెల్లూరు: రాష్ట్రంలో రైతుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి పట్ల నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నిప్పులు చెరిగారు. ఆదివారం నెల్లూరు నగరంలో జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు రోజూకో మాటా పూటకో అబద్ధం చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రుణమాపీ కాదు... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాఫీ చేస్తే బాగుంటుందని వారు ఎద్దేవా చేశారు. వ్యవసాయ, పంట రుణాలు వేరు చేసి చెప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
జిల్లా ప్రజలు తమ పార్టీని ఆదరించారని అందుకే నెల్లూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా మంజూరు చేయకుండా చంద్రబాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. బెల్టు షాపులు తీస్తామన్నారు.. ప్రస్తుతం ఎక్కడా చూసినా అవే ఉన్నాయి.. వాటిని పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుణమాఫీ కోసం కలెక్టరేట్ల వద్ద ధర్నా అనగానే చంద్రబాబు హడావుడి ప్రకటన చేశారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. రైతులకు పూర్తి రుణమాఫీ కోసం తామంతా పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్ హాజరయ్యారు.