గన్‌ పేలి విశాఖలో నేవీ ఉద్యోగి మృతి


ఆత్మహత్య అనే అనుమానాలు

 

మల్కాపురం (విశాఖపశ్చిమ): అనుమానాస్పద రీతిలో నేవీ ఉద్యోగి మృతి చెందిన ఘటన గురువారం విశాఖలో జరిగింది. గన్‌ పేలి వికాశ్‌ (21) అనే నేవీ సెయిలర్‌ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వికాశ్‌ ఐఎన్‌ఎస్‌ రాణా యుద్ధనౌకలో సెయిలర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతను విధుల్లో చేరాడు. యుద్దనౌకకు సమీపాన నేవల్‌ డార్మినేటర్‌లో తోటి ఉద్యోగులతో కలసి ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజాము నాలుగు గంటలకు నౌక వద్దకు సెక్యూరిటీ విధులకు వెళ్లాడు. అయితే విధుల్లో ఉండగా.. కొద్ది సేపటికే గన్‌ పేలింది. వికాశ్‌ దవడ క్రింద భాగం నుండి తల పైభాగం మీదుగా బుల్లెట్‌ వెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.



గన్‌ శబ్దంతో శత్రువులు ఎవరైనా వచ్చారా అని చూడటానికి వచ్చిన తోటి ఉద్యోగులు.. కుప్పకూలి ఉన్న వికాశ్‌ను చూసి పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వికాశ్‌ను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. సమాచారాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం మల్కాపురం పోలీసులకు నేవీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ కేశవరావు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

 

మృతిపై అనుమానాలు..: యుద్ధనౌకలో దిగువ స్థాయి ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. వికాశ్‌ మృతికి ఈ కారణం ఏమైనా ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వ్యక్తిగత సమస్యల కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top