
నంది అవార్డులతో నారాయణస్వామి
అనంతపురం కల్చరల్: కోస్తా జిల్లాలకే పరిమితమైన నంది నాటక పురస్కారాలను తనదైన అభినయంతో జిల్లా కళా రంగానికి తెచ్చిపెట్టిన నట దిగ్గజం నారాయణస్వామి (74) శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. 1945లో బెళుగుప్ప మండలం గంగవరం గ్రామంలో గాజుల ఎర్రప్ప, దొనమ్మ దంపతులకు నారాయణస్వామి జన్మించారు. వృత్తిరీత్యా ఇంజినీరు అయినా, అనంత నాటక రంగానికీ సేవలందించారు. నటుడిగానే కాకుండా లలితకళా పరిషత్తుకు దశాబ్దాల పాటు సేవలంచారు. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరుగా పని చేస్తున్న సమయంలోనూ అనేక పౌరాణిక పాత్రలను పోషించి, శభాష్ అనిపించుకున్నారు.
శ్రీ కృష్ణుడిగా, బాలనాగమ్మ నాటకంలో కార్యవర్ధిగా, మాయల మరాఠిగా, శ్రీ రాఘవేంద్రస్వామి విజయం నాటకంలో రూధర్‌ఫర్డ్ దొరగా అనేక ప్రాంతాల్లో నటించి అక్కడ వారి ప్రశంసలందుకున్నారు. సతీసావిత్రి నాటకంతో ఆయన పేరు ప్రఖ్యాతులు రాష్ట్రమంతటా వ్యాపించాయి. తొలిసారి నాటక పోటీల్లో దిగ్గజాలతో పోటీపడి యమధర్మరాజుగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను చేపట్టి 6 నందులు గెలుచుకున్నారు. ఇటీవల ప్రతిష్టాత్మక కందుకూరి వీరేశలింగం అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆయన బలిజ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్వగ్రామం పాల్వాయిలో అంత్యక్రియలు జరిగాయి. నారాయణస్వామికి భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు (న్యాయవాది పద్మజ) ఉన్నారు.