నెవ్వర్‌ బిఫోర్‌ సీఎం సార్‌..  | MSME owners says thanks to CM YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

నెవ్వర్‌ బిఫోర్‌ సీఎం సార్‌.. 

May 23 2020 3:28 AM | Updated on May 23 2020 7:57 AM

MSME owners says thanks to CM YS Jaganmohan Reddy - Sakshi

శివ పోల్స్‌ ఇండస్ట్రీకి రూ. 65,30,648 చెక్కును అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు

సాక్షి, అమరావతి:  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రీస్టార్ట్‌ పేరుతో ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించడం సంతోషంగా ఉందని, నిజానికి దీనిని అస్సలు ఊహించలేదని ఎంఎస్‌ఎంఈలకు చెందిన పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో అన్నారు. గత సర్కారు చెల్లించని బకాయిలు ఇవ్వడంతో పాటు ఆ మొత్తాన్ని నేరుగా ఖాతాల్లో జమచేయడం ఇదే తొలిసారని.. దీని ద్వారా చిన్న యూనిట్లకు ఊపిరిపోశారంటూ వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ ఎంఎస్‌ఎంఈలకు ఎవ్వరూ ఇలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని, క్షేత్రస్థాయిలో అంశాలపై పట్టున్న నాయకుడిగానే సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రశంసించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆసరాతో ముందడుగు వేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పలువురు ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులు తెలిపారు.

రీస్టార్ట్‌ ప్యాకేజీని శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ స్పందిస్తూ.. తమ జిల్లాలో 10వేల ఎంఎస్‌ఎంఈలకు ఈ ప్యాకేజీ వల్ల మేలు జరుగుతుందని, జిల్లాకు రూ.55కోట్లు రానున్నాయన్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కేంద్రం కూడా పారిశ్రామిక రంగానికి సహాయం ప్రకటించిందని, దాన్ని ఎలా పొందాలి.. ఇక్కడ ఎలా మేలు చేయాలన్నది కలెక్టర్లు, పరిశ్రమల శాఖ అధికారులు ఆలోచించాలని కోరారు. అనంతరం ఇతర జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రితో పంచుకున్నారు. పరిశ్రమల యజమానులు ఏమన్నారంటే.. 

చరిత్రలో నిలిచిపోతారు 
రూ.10 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుచేశాను. ఇందులో 200 మంది పని చేస్తున్నారు. పరోక్షంగా వేయి మంది ఉపాధి పొందుతున్నారు. కానీ, గత ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహకాలు రాక, చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మాకు ఒకేసారి ప్రోత్సాహక మొత్తంగా రూ.905 కోట్లు విడుదల చేయడం ద్వారా మీరు మా పరిశ్రమల రంగం చరిత్రలో నిలిచిపోతారు. ఆ ప్యాకేజీతో నా పరిశ్రమకే రూ.1.30 కోట్లు వస్తున్నాయి. ఈ విధంగా గతంలో ఎవ్వరూ ప్రకటించలేదు. ప్యాకేజి నిర్ణయం మాకెంతో ధైర్యాన్నిచ్చింది. అదే విధంగా ప్రభుత్వానికి అవసరమైన వస్తువులు, సామాగ్రిలో 25 శాతం మా నుంచి కొనాలన్న నిర్ణయం కూడా మాకు మేలు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషిస్తాం.     
– డీవీ రాజు, చిన్న పరిశ్రమ యజమాని, విశాఖ జిల్లా 
 
మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం 
రూ.1.25 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ పెట్టాను. అందులో 25 మందికి ఉపాధి లభిస్తోంది. మాకు 25 లక్షల రాయితీలు రావాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఆ సహాయం చేశారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. 
– లక్ష్మి, గ్రానైట్‌ కంపెనీ యజమానురాలు, ప్రకాశం జిల్లా 

ప్యాకేజీతో ఎందరికో మేలు జరుగుతుంది 
ఆటోనగర్‌లో 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. రెండేళ్లుగా మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కరోనా మరింత దెబ్బ తీసింది. మేం కొన్ని రాయితీలు కోరితే వెంటనే ఆమోదించారు. చాలా సంతోషం. నిజానికి ఊహించలేదు కూడా. మార్కెట్‌లో ఒకేసారి రూ.905 కోట్లు రావడంవల్ల ఎందరికో మేలు జరుగుతుంది.  
    – బాలాజీ, ఆటోనగర్, విశాఖపట్నం  

ఇది ఎంతో మంచి నిర్ణయం 
2017లో కోటి రూపాయల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుచేశాను. అందులో 20 మంది పనిచేస్తున్నారు. నెలకు 2 లక్షలకు పైగా జీతాలు ఈ కోవిడ్‌ సమయంలో కూడా ఇస్తున్నాం. మాకు పీవీసీ కంపెనీ కూడా ఉంది. రెండింటికీ కలిపి మొత్తం రూ.33 లక్షల సహాయం అందుతోంది. మాకు విద్యుత్‌ ఛార్జీలు మాఫీ చేశారు. ఇప్పుడు వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా తక్కువ వడ్డీకి ఇస్తామన్నారు. అది కూడా మాకు ఎంతో అండగా ఉండనుంది. ప్రభుత్వ అవసరాల నిమిత్తం మా నుంచి 25 శాతం ఉత్పత్తులు కొంటామన్నారు. ఇది ఎంతో మంచి నిర్ణయం. 
    – విజయభాస్కర్‌రెడ్డి, వెంకటాచలం, నెల్లూరు జిల్లా 

ఈ ప్యాకేజీ అమృతంలా ఉంది
2018లో కోటి రూపాయలతో కంపెనీ పెట్టాను. అందులో రూ.74 లక్షల రుణం తీసుకున్నాను. మహిళలకు అవసరమైన బయో శానిటరీ నేప్కిన్స్‌ తయారుచేస్తున్నాను. 2019 జనవరి నుంచి నెలనెలా రూ.1.60 లక్షల ఈఎంఐ కట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో నాకు యూకే నుంచి రూ.20 లక్షల ఆర్డర్‌ వచ్చింది. కానీ, పెట్టుబడి లేక వద్దనుకున్నాను. ఇప్పుడు నాకు రూ.26.66 లక్షల రాయితీ.. రూ.11 లక్షల వడ్డీ వస్తుంది. దీంతో ఆర్డర్‌ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాకేజీ అమృతంలా నిలుస్తోంది. మీరు ‘నవరత్నాలు’ అమలుచేస్తున్నారు. కానీ, మాకు 10వ రత్నం కూడా ఉంది. అది మీరే. నిజంగా మీరు రత్నం వంటి వారు.
    – పి.శ్రీలత, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా

అందరికీ ఆదర్శంగా నిలిచారు.. 
రూ.2.30 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టాను. అందులో 25 మంది పనిచేస్తున్నారు. గతంలో మాకు రాయితీ ఎగ్గొట్టారు. మాకు ఇప్పుడు రూ.89 లక్షలు వస్తున్నాయి. అందుకు ఎంతో సంతోషం. కోవిడ్‌తో అతలాకుతలమైనా ఎవ్వరూ తీసుకోని నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. అందుకు హ్యాట్సాఫ్‌.
– హరిశ్చంద్రశేఖర్, గ్రానైట్‌ పరిశ్రమ యజమాని, ప్రకాశం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement