తహశీల్దార్‌పై దాడి అమానుషం | MRO Vanajakshi petition accepted HRC against | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌పై దాడి అమానుషం

Jul 10 2015 12:25 AM | Updated on Apr 4 2019 12:56 PM

విధి నిర్వహణలో ఉన్న కృష్ణ జిల్లా ముసునూరు మండల తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి

శ్రీకాకుళం పాతబస్టాండ్: విధి నిర్వహణలో ఉన్న కృష్ణ జిల్లా ముసునూరు మండల తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. మహిళ అని కూడా చూడకుండా తన అనుచరులతో కలిసి దాడి చేయడం అమానుషమని సంఘ ప్రతినిధులు అన్నారు. శ్రీకాకుళంలోని రెవెన్యూ సర్వీసుల సంఘ కార్యాలయంలో గురువారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జె.రామారావు తదితరులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు.
 
  అధికార పార్టీకి చెందిన నాయకులు వారి కార్యకర్తలు, అనుచరుల అక్రమాలను కాపాడేందుకు, తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక నిర్వహణపై ప్రభుత్వం చట్టం చేసి, కమిటీలను వేసిందని, అయితే ప్రభుత్వంలో కీలక భాధ్యతలు వహిస్తున్న వారే ఇటువంటి దాడులు చేయడం విచారకరమన్నారు. ఈ దాడులు ముఖ్యమంత్రికి తెలిసే జరిగితే..అతను కూడా దాడులను ప్రోత్సహిస్తున్నట్టే భావించాల్సి ఉంటుందన్నారు. వీఆర్‌ఏ నుంచి ఎస్‌డీసీ వరకు అన్నిస్థాయిల రెవెన్యూ ఉద్యోగులు ఎకతాటిపై దాడికి నిరసనగా పోరాడాలని పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని, దాడులు పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కలుగజేసుకొని దాడికి పాల్పడినవారిపై  తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బి.శాంతి, వేణుగోపాల్, చంద్రశేఖర్, పి.రాంబాబు, పి.సంఘమేశ్వరరావు పాల్గొన్నారు.
 
 చింతమనేనిని అనర్హుడిని చేయాలి
 శ్రీకాకుళం: దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ఆ పదవికి అనర్హుడిని చేయాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిలారి నారాయణరావు డిమాండ్ చేశారు. ఎంఆర్‌ఓ వనజాక్షిపై దాడి చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులపైన, తోటి ప్రజాప్రతినిధులపైన దురుసుగా ప్రవర్తించడం చింతమనేనికి పరిపాటి అయిందని, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement