అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

Published Wed, Sep 17 2014 12:22 AM

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

దాచేపల్లి: లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ జీవీ రమణమూర్తి తెలిపిన వివరాల మేరకు .. నడికుడి మార్కెట్‌యార్డు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఏపీ 07ఎక్స్9959 నంబర్ లారీని ఆపి తనిఖీలు చేశారు. 300 బస్తాల రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ లారీని వదిలిపెట్టి పరారయ్యాడు. క్లీనర్‌తో పాటు బియ్యం తరలించేందుకు సహకరించిన మరో వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నకరికల్లు మండలం రూపెనగుంట్లకు చెందిన గోగా రమేష్, సురేష్‌లు రేషన్‌బియ్యం సేకరించి అక్రమంగా లారీలో మిర్యాలగూడేనికి తరలిస్తున్నారని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. రమేష్, సురేష్‌లతో పాటు లారీ డ్రైవర్ ఎం.శ్రీనివాసరెడ్డి, క్లీనర్ కె.రాము, లారీలో బియ్యం తరలించేందుకు సహకరించిన రామాజంనేయులుపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్‌సప్లయ్ అధికారులకు అప్పగించారు. తనిఖీల్లో విజిలెన్స్ తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 పిన్నెల్లిలో 73 బస్తాల స్వాధీనం
 పిన్నెల్లి(మాచవరం): మండలంలోని పిన్నెల్లిలో అక్రమంగా తరలించేందుకు ఆటోల ద్వారా లారీలో లోడ్ చేస్తున్న రేషన్ బియ్యం, లారీని విజిలెన్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ మోహన్‌రావు ఆదేశాలు, విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు గ్రామం చివరిలో కాపు కాసి లారీలో తరలిస్తున్న 73 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. బత్తుల వెంకటేశ్వర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ సీఐ కిషోర్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లారీ, బియ్యం బస్తాలతోపాటు ఓ కూలీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. లారీని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు విజిలెన్స్ సీఐ తెలిపారు. ఈ రేషన్ బియ్యం ఏ రేషన్‌షాపులోనివి అనేది తహశీల్దార్ విచారణలో తెలియాల్సి ఉందని చెప్పారు.
 
 
 
 
 

Advertisement
Advertisement