ఎంతపని చేశావమ్మా...

Mother with two kids commits suicide at Vizianagaram  - Sakshi

ఇద్దరు బిడ్డలు సహా రైలుకింద పడిన తల్లి

బడికి పిల్లల్ని తీసుకెళ్తూ మనసు మార్చుకుని ఆత్మహత్య

అఘాయిత్యానికి తెలియరాని కారణాలు

పార్వతీపురంలో జరిగిన ఘోరం

అల్లుడి తీరుతో విసుగుచెందే ఈ ఘాతుకమని తల్లిదండ్రుల వేదన

పాపం ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో... కడుపుతీపిని కూడా కాదనుకుంది. నవమాసాలు మోసి కన్నబిడ్డలపై మమకారాన్ని కూడా చంపుకుంది. తాను లేని ఈ లోకంలో ఆ చిన్నారులకు రక్షణ లేదని భావించిందో ఏమో... మనసు రాయి చేసుకుంది. పాఠశాలకు తీసుకెళ్లాల్సిన చిన్నారులను తనతోపాటే మృత్యుఒడికి చేర్చింది. పార్వతీపురంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటన పెను సంచలనమైంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

పార్వతీపురం: పార్వతీపురం పట్టణం బెలగాం 18వ వార్డు పరిధిలోని బూరాడ వీధికి చెందిన శివ్వాపు శంకర్‌కు మెరకముడిదాం మండలం ఉత్తరావిల్లికి చెందిన కుమారి(23)తో ఏడేళ్ళక్రితం వివాహం జిరిగింది. వారికి ఆరేళ్ళ లిఖిత, నాలుగేళ్ళ హేమని అనే ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. శంకర్‌ లగేజ్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దకుమార్తె లిఖిత నారాయణ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా హేమని సూర్యతేజ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. రోజు వారి దిన చర్యలో బాగంగా శంకర్‌ ఐరన్‌ గజాల లోడ్‌ను ఆటోలో వేసుకుని ఒడిశా రాష్ట్రంలోని బందుగాంకు బుధవారం ఉద యం వెళ్లాడు. 

అతని భార్య కుమారి తన ఇద్దరు పిల్లలను ఎప్పటిమాదిరిగా ఉదయం బడికి సిద్ధం చేసింది. యూనిఫాం వేయించి, వారికోసం క్యారేజీలు సిద్ధం చేసి, బ్యాగ్‌లు వేయించి పిల్లలిద్దరిని తీసుకుని పాఠశాలకు బయలుదేరి వెళ్లింది. ముం దుగా పె ద్ద కమార్తెను దగ్గర్లో ఉన్న నారాయణ పాఠశాలలో విడిచిపెట్టి ఆ తరువాత రెండవ కుమార్తెను హేమనిని సూర్యతేజ పాఠశాలకు రో జూ తీసుకెళ్లేది. కానీ నారాయణ పాఠశాల సమీపంలోని ఒక ఖానా వద్దకు వెళ్లేసరికి ఆమె ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియదు. మనసుకు ఏం కష్టం కలిగిందో తెలియదు. ముందు రోజు ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. ఏం ఒత్తిడికి గురైందో తెలియదు. పాఠశాలవైపు వేయాల్సిన అడుగులు కాస్తా రైలు పట్టాలవైపు పడ్డాయి.

పాఠశాల ఇటువుంటే అటువైపు ఎందుకు వెళ్తున్నావెందుకని ఎవరైనా అడుగతారేమోనని భావించింది కాబోలు పిల్లల పుస్తకాల బ్యాగు, క్యారేజ్‌ పాఠశాలకు సమీపంలో ఒక కాణాపై విడిచిపెట్టి పిల్లలు ఇద్దరిని తీసుకుని రైలు పట్టాలు వైపు వెళ్లింది. పిల్లలు ఎక్కడ తప్పించుకుంటారో ఏమోనని తానే గట్టిగా పట్టేసుకుని ఎదురుగా వస్తున్న గూడ్సు రైలుకు అడ్డంగా నిలబడి ఆత్మహత్య చేసుకుంది. లిప్తపాటులో ఆ ముగ్గురి శరీరాలు రైలు పట్టాలపైనే నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయారు. కుమారి తల పూర్తిగా తెగి పడి గుర్తించడానికి కూడా వీలు లేని విధంగా తయారైంది. మొండెం కూడా నుజ్జుగా మారింది. లిఖిత కాలు తెగిపోయి మృతి చెందింది. హేమని ముఖం, కాలికి తీవ్రగాయా భయానకంగా కనిపించింది.

ఉలిక్కిపడిన రైతు కూలీలు
అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న కొందరు రైతులు, వ్యవసాయ కూలీలు చూసి ఉలిక్కిపడ్డారు. వెంటనే పరుగు పరుగున వెళ్లి అక్కడకు చేరుకుని మృతులను గుర్తించి అయ్యోరామా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కూత వేటు దూరంలో నుంచి చూసి కూడా ఆపలేకపోయామని వారు ఆవేదన చెందారు. పిల్లలను ఎవరో పట్టాలు దాటిస్తున్నారు అనుకున్నామే తప్పా ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారని గమనించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నీరుమున్నీరైన శంకర్‌
ఐరన్‌లోడ్‌ తీసుకుని ఒడిశా రాష్ట్రానికి వెళ్లిన శంకర్‌కు వీధిలోనివారు సమాచారం అందజేయగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యాడు. ఇలా తనను విడిచి అన్యాయం చేస్తారా అంటూ రోదించారు. ఆయన్ను ఓదార్చడం మిత్రుల వల్ల కాలేదు. 

ఏ కష్టం లేకుంటే ఎందుకిలా చేస్తుంది?
సంఘటన సమాచారం తెలుసుకున్న కుమారి తల్లిదండ్రులు పిన్నింటి సత్యవతి, లక్ష్మణ ఉత్తరావల్లినుంచి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన అల్లుడితో వేగలేకే ఇలా ప్రాణాలు తీసుకుందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లుడు ఎప్పుడూ సరిగా ఇంటికి రాడని, రాత్రి 11 దాటిన తరువాత మద్యం తాగి ఇంటికి వస్తుంటాడని తమతో ఎన్నోసార్లు చెప్పిందనీ, ఆ సందర్భంలో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండేవని తమకు తెలిసినా... అది సాధారణంగా వచ్చే కుటుంబ కలహాలే కదా అని నచ్చజెప్పేవారమని బావురుమన్నారు. అదే వీధిలో తన అల్లుని తల్లిదండ్రులు ఉంటున్నారనీ, అత్త తమ కుమార్తెను నిత్యం వేధిస్తుండేదని ఆరోపించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలేమిటో వెలికి తీయాల్సిందిగా తాము పోలీసులను కోరుతామని చెప్పారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కుమారితో పాటు పిల్లల ఆత్మహత్యపై పార్వతీపురం రైల్వే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కుమారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తరువాత పట్టణ పోలీసులకు దర్యాప్తు నిమిత్తం అప్పగించారు. మృత దేహాలను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top