రౌడీరాజ్యం అనుకుంటున్నారా?

MLA Visweswar reddy Slams Handri Neeva River Officials - Sakshi

హంద్రీ – నీవా అధికారులపై ఎమ్మెల్యే విశ్వ ఆగ్రహం

అనంతపురం సెంట్రల్‌: ఉరవకొండ నియోజకవర్గంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా బెదిరించి హంద్రీనీవా పనులు చేపడుతున్నారని, ఇదేమైనా రౌడీరాజ్యం అనుకుంటున్నారా అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలో ఆయకట్టుకు నీరివ్వాలని, రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్‌ పనులు మొదలుపెట్టాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం హంద్రీనీవా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యాలయం వద్ద రైతులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కింద దాదాపు 80వేల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నిరీచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిచ్చేందుకు వెంటనే పిల్లకాలువలు తవ్వాలని, రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్‌ పనులు వెంటనే చేపట్టి 8వేల ఎకరాలకు నీరివ్వాలని డిమాండ్‌ చేశారు.

2016లో అసెంబ్లీలో రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్‌ పనులపై ప్రశ్నించినప్పుడు రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని స్వయంగా సీఎం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని, అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయంపల్లి, నెరిమెట్ల గ్రామాలకు వెల్లే పిల్లకాలువల పనులు ఎందుకు నిలిపేశారని నిలదీశారు. అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పనులు మాని రైతులకు మేలు చేయాలని హితవు పలికారు. బెళుగుప్ప మండలంలో 36వ ప్యాకేజీలో పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. బూదగవి చెరువు నింపిన సమయంలో పంటలు సాగు చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి కూడా ఇంతవరకూ పరిహారం అందలేదని తెలిపారు. వెంటనే చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఆరునెలలు ఓపిక పడితే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, వెంటనే మూడు నెలల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, హంద్రీనీవా ఆయకట్టు సాధన సమితి నాయకులు అశోక్‌కుమార్, తోజేనాథ్, ఎర్రిస్వామి, గోపాల్‌రెడ్డి, దుబ్బర వెంకటేసు, నాగరాజు, యోగేంద్రనాథ్, జగన్నాథ్‌రెడ్డి, హనుమంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనలో పండు ముసలవ్వ
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఆందోళనలో రాకెట్లకు చెందిన పండుముసలవ్వ సుబ్బమ్మ పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోతున్నామని, తాము వైఎస్సార్‌సీపీ వాళ్లమనే తమ గ్రామాలపై కక్ష సాధిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పొలాలకు నీళ్లివ్వాలని సుబ్బమ్మతోపాటు మరో వృద్ధురాలు రేణమ్మ అధికారులకు చేతులు జోడించి వేడుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top