
క్షతగాత్రులను పరీక్షిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు సకాలంలో సపర్యాలు చేసి 108 అంబులెన్స్‌ను పిలిపించి వైద్యశాలకు తరలించి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం చిలకలూరిపేట–విజయవాడ జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు బెంగుళూరుకు కారులో వెళుతుండగా కళ్లెం టెక్స్‌టైల్స్‌కు ఎదురుగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది.
ఈ సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయానికి ఆ మార్గంలో గుంటూరుకు వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సంఘటనా స్థలంలో ఆపి స్థానికుల సహాయంతో కారు నుంచి ఆ యువకులను కిందకు తీయించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన అంబులెన్స్ వారిద్దరిని సిబ్బంది గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి స్పందించిన తీరును స్థానికులు ప్రశంసించారు.