జీకేవీధి మండలం దారాలమ్మ ఘాట్‌లో బ్రేకులు ఫెయిలయి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పింది.
{బేకులు ఫెయిలై అదుపు తప్పిన ప్రైవేటు బస్సు
దూసుకుపోతుండగా దానిని ఢీకొట్టిన మరో ఆర్టీసీ బస్సు
3 గంటలు ట్రాఫిక్‌కు అంతరాయం
సీలేరు: జీకేవీధి మండలం దారాలమ్మ ఘాట్‌లో బ్రేకులు ఫెయిలయి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పింది. లోయలోకి దూసుకుపోతున్న దానిని అదే సమయంలో మరో ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికుల ప్రాణాలు మిగిలాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం నుంచి రోజూ సీలేరుకు ఓ ప్రైవేటు బస్సు రాకపోకలు సాగిస్తున్నది. మండలంలోని దారాలమ్మ ఆలయం సమీపంలోని పెద్ద మలుపు వద్ద శుక్రవారం దాని బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బస్సు డ్రైవర్ చెట్టును ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న పెద్ద బండపైకి బస్సు దూసుకుపోయింది.
లోయలోకి పడిపోతున్న సమయంలో మల్కన్‌గిరి నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళుతున్న మరో ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి దానిని ఢీకొంది. దీంతో రెండు బస్సులు నిలిచిపోయాయి. వాటి ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. రెండింటిలో సుమారు వందమంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఏ ప్రమాదం వాటిల్ల లేదు. ఈ సంఘటనతో మూడు గంటలపాటు ఇరువైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతరరాష్ట్ర రహదారి కావడం, వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.