ఆదాయ వనరులపై మంత్రుల సమీక్ష

Ministers Review of Sources of Income - Sakshi

ఏలూరు టౌన్‌: పన్నుల వసూళ్లను వేగవంతం చేసి ఆదాయ వనరులను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య  పన్నుల శాఖమంత్రి కె.నారాయణస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో మంత్రి నారాయణస్వామి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని సంబంధిత శాఖ అధికారులతో ఏలూరు డివిజన్‌ ఆదాయ వనరులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా బలపడేందుకు పన్నుల వసూలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. పన్నుల చెల్లింపులో జాప్యం వహిస్తున్న వారిని గుర్తించి రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. పాత బకాయిలు రాబట్టేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు.  ఏలూరు డివిజన్‌ పరిధిలోని 9 సర్కిల్‌ కార్యాలయాలలో ఆకివీడు, భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు–1, తణుకు–2లలో  భీమవరం సర్కిల్‌లో పన్నుల వసూళ్లు అధికంగా ఉన్నాయని చెప్పారు.

మిగతా సర్కిల్స్‌లో సిబ్బంది కూడా పోటీతత్వంతో పనిచేసి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణం, కేబుల్‌ నెట్‌వర్క్, ఆటోమొబైల్స్, కెమికల్స్, ఎరువులు, పురుగుమందులు, సిరామిక్, టైల్స్‌తో పాటు ఇతర ఆదాయ రంగాల నుంచి వసూలు అయిన మొత్తం ఎంత, ఇంకా ఎంతవసూలు కావాలి, గత మూడు నెలల రాబడి ఎంత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ డి.శ్రీలక్ష్మి జిల్లాలో ఆదాయ వనరులపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సమీక్షలో డిప్యూటీ కమిషనర్స్‌ హర్షవర్ధన్, స్వప్నదేవి, చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top