రవాణా శాఖ యూనిట్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు

Minister Perni Nani Review Meeting With Transport Department Officials - Sakshi

ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్‌ విధానం కుదింపు

ఆర్టీసీ సహకారంతో ఫిట్‌నెస్‌ పరీక్షలు

రవాణా అధికారులతో మంత్రి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ సమీక్ష

సాక్షి, అమరావతి/చిలకలపూడి (మచిలీపట్నం) : రాష్ట్రంలోని ఎంవీఐ కార్యాలయాల నుంచి జిల్లా కేంద్రాల వరకు అన్ని చోట్లా అత్యాధునిక సాంకేతిక విధానాలతో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. దీనికి అవసరమైన భూసేకరణకు ప్రతిపాదనలు పంపించాలని రవాణా అధికారులకు ఉన్నతస్థాయి బృందం సూచించింది. ఆదివారం మచిలీపట్నంలో రవాణా అధికారులతో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్‌ సేఫ్టీపై ప్రభుత్వ ప్రాధాన్యతతో పాటు కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాహనదారులకు కేటాయించే లెర్నర్‌ లైసెన్సు రిజిస్ట్రేషన్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) స్లాట్‌లను ఆగస్టు నెల ప్రారంభం నుంచి కుదించాలని, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయంలోనే ఏ రోజుకారోజు ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలు ముగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ నాలుగో స్థానంలో ఉందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో రవాణా ఆదాయ లక్ష్యం రూ.4 వేల కోట్లు కాగా, ఎన్‌ఫోర్సుమెంట్‌ ద్వారా లక్ష్యాలు చేరుకోవాలని చిన్న చిన్న వాహనాలతో జీవనం సాగించే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి నాని అధికారులకు సూచించారు. జాతీయ రహదారులపై నిత్యం డ్రంకన్‌ డ్రైవ్‌ చేపట్టాలని స్పష్టం చేశారు. త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుందని కమిషనర్‌ పేర్కొన్నారు. రహదారి భద్రతపై వరంగల్‌ నిట్‌కు చెందిన ప్రొఫెసర్‌ సీఎస్సార్కే ప్రసాద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 

ఈ సమీక్షలో ముఖ్య నిర్ణయాలు

  • వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీలకు ఆర్టీసీ సిబ్బందితో సమన్వయం చేసుకుని వారి సేవలను వినియోగించుకోవాలి. 
  • నెలలో మూడో శుక్రవారం రవాణా ఉద్యోగుల గ్రీవెన్స్‌ కోసం మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లు కలిసి హాజరవుతారు.
  • ఇకపై విధిగా పోలీసుల మాదిరిగానే రవాణా జిల్లా స్థాయి అధికారులు సోమ, శుక్రవారాల్లో యూనిఫాం ధరించాలి.
  • రవాణా మంత్రి, కమిషనర్‌ సంయుక్తంగా అన్ని జిల్లాల్లోని రవాణా కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతారు. 
  • రవాణా డీలర్ల వ్యవహార శైలిని గమనిస్తూ, ప్రతి డాక్యుమెంట్‌ తనిఖీ చేయాలి. లైఫ్‌ ట్యాక్స్‌ ఎంత చెల్లిస్తున్నారో నిశితంగా పరిశీలించాలి. ఇందులో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలుంటాయి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top