క్లీన్‌ సిటీగా నెల్లూరు 

Minister Anil Yadav Promice Nellore Become Clean city - Sakshi

సాక్షి, నెల్లూరు : ‘నెల్లూరును అద్భుతంగా చేస్తానని మాటలు చెప్పను..నెల్లూరును క్లీన్‌సిటీగా మాత్రం తీర్చిదిద్దుతాం’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్‌ పీ అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో శనివారం సాయంత్రం కార్పొరేషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారి శేషగిరిబాబు, కమిషనర్‌ అలీంబాషా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నెల్లూరు ప్రజల ఆశీస్సులతో తనకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శక పాలనను అందిస్తామన్నారు. ప్రజలు పన్ను రూపంలో కార్పొరేషన్‌కు చెల్లించే ప్రతి రూపాయికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. నగరం అందాల పేరుతో ప్రజల ఆరోగ్యాలను విస్మరించకుండా క్లీన్‌ నెల్లూరుగా చేసి చూపిస్తామన్నారు.

ఇటీవల అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి సమస్య తలెత్తిందన్నారు. భూగర్భజలాలు అడుగంటాయన్నారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసేలా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. ఫ్లెక్సీలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు,  ఫ్లెక్సీల పన్నులను ఆన్‌లైన్‌లో కార్పొరేషన్‌కు చెల్లించేలా చర్యలు చేపడుతామన్నారు. కార్పొరేషన్‌ వాహనాలకు జీపీఎస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భడ్రైనేజీ కనెక్షన్‌కు ప్రతి ఇంటికీ రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చవుతుందని, ప్రజలపై ఆ భారం లేకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు వెసులుబాటు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

ప్యాకేజీ విధానానికి స్వస్తి
కాంట్రాక్ట్‌ పనులను ప్యాకేజీల రూపంలో నాలుగు నుంచి ఐదు శాతం ఎక్కువ మొత్తానికి  భారీ కంపెనీలకు అప్పగించే విధానానికి స్వస్తి పలుకుతామని మంత్రి అనిల్‌కుమార్‌ తెలిపారు. కార్పొరేషన్‌లో చేపట్టే అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. 150 మందికిపైగా కాంట్రాక్టర్లకు అనుమతి ఇచ్చి తక్కువ మొత్తానికి కోడ్‌ చేసిన వారికి పనులు అప్పగిస్తామన్నారు. అభివృద్ధి పనులపై అన్ని పార్టీల నాయకులతో సమీక్షలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, మాజీ కార్పొరేటర్లు పీ రూప్‌కుమార్‌యాదవ్, ఆనం రంగమయూర్‌రెడ్డి, లక్ష్మీసునంద, నూనె మల్లికార్జున్‌యాదవ్, అడిషనల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ఆఫీసర్‌ వెంకటరమణ, ఎస్‌ఈ రవికృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top