వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు


సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీ ఏర్పాటు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పని చేసేందుకు అన్ని పార్టీల నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు మొదటి నుంచి అలుపెరగని పోరాటం సాగించినా.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రం రెండుగా చీలిపోయింది. ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతుండటంతో ఎన్నికల వేళ పార్టీలో చేరికలు ముమ్మరమయ్యాయి.

 

 శుక్రవారం ఆలూరు నియోజకవర్గంలో కీలకమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు పలువురు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వైకుంఠం శివప్రసాద్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నీరజారెడ్డి ముఖ్య అనుచరుడు మార్కెట్‌యార్డు చైర్మన్ డేగులపాడు గోవిందప్ప, మాజీ సర్పంచ్ మల్లికార్జున, నంచర్ల సర్పంచ్ రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీలు మల్లికార్జున, బెల్డోణ ఈరన్న, రైల్వే కాంట్రాక్టర్ విరూపాక్షి, మండల కాంగ్రెస్ నాయకుడు పెద్ద పెద్దయ్య, లాల్‌స్వామి, మారయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు లింగన్న తదితరులు వంద మందితో ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిపోయారు. నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు ముఖ్యమైన నాయకులు పార్టీ మారడం చర్చనీయాంశమైంది.

 

 ఏళ్ల తరబడి టీడీపీనే నమ్ముకున్న వైకుంఠం శివప్రసాద్‌ను కాదని మరొకరికి టిక్కెట్ కేటాయించడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతమే కాకుండా.. టిక్కెట్లను అమ్ముకునేందుకూ వెనుకాడటం లేదని వారు ఆరోపిస్తున్నారు. బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం కల్పించడం లేదంటూ రెండు రోజుల క్రితం ఆలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు, వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ బహిరంగంగా విమర్శించారు. ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్, టీడీపీల్లో కలకలం రేగుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top