చూచిరాత ఇ'లా'

mass copying in law degree semester exams - Sakshi

సెమిస్టర్‌ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌

సహకరిస్తున్న పరీక్షా కేంద్రం యాజమాన్యం

చూచిరాత కోసం ఫీజు వసూలు

చోద్యం చూస్తున్న యూనివర్సిటీ అధికారులు

న్యాయశాస్త్రం డిగ్రీ అంగట్లో సరుకులా మారింది. సెమిస్టర్‌ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందుకుగాను కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించా ల్సిన యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్‌ కళాశాలకు దాసోహమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూచిరాతల అవకాశం ఉండడంతోనే తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు న్యాయశాస్త్రం అభ్యసించేందుకు పుత్తూరును ఎంచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

పుత్తూరు:   విశ్వసనీయ వర్గాల సమాచారం మండల పరిధిలోని ఒక ప్రైవేట్‌ లా డిగ్రీ కళాశాల విద్యార్థులు గత వారం రోజుల నుంచి మరో ప్రైవేట్‌ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు.  యథేచ్ఛగా పుస్తకాలు ముందర పెట్టుకుని పక్కపక్కనే కూర్చొని పరీక్షలను రాస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇందుకు పరీక్షా కేంద్రం యాజమాన్యం సహకరిస్తుండడం, యూనివర్సిటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చూచిరాతల కోసం లా విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యం ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో పరీక్షా కేంద్రం యాజమాన్యాలకు, యూనివర్సిటీ అధికారులకు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు విద్యార్థుల క్యూ..
ప్రత్యేకించి పుత్తూరులో లా డిగ్రీ చదివేందుకు తమిళనాడుకు చెందిన వందలాది మంది విద్యార్థులు కొన్నేళ్లుగా క్యూ కడుతున్నారు. గతంలో తమిళ సినీ యాక్టర్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య కూడా పుత్తూరులోని ప్రైవేట్‌ లా కళాశాల విద్యార్థిగానే డిగ్రీ పరీక్షలకు హాజరుకావడం అప్పట్లో సంచలనమైంది. తమిళనాడులో లా డిగ్రీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తుండడంతో చూచిరాతలకు అనుకూలంగా ఉన్న పుత్తూరును ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర పట్టణాల నుంచే కాకుండా కేరళ నుంచి కూడా లా డిగ్రీ కోసం విద్యార్థులు పుత్తూరులోని ప్రైవేట్‌ కళాశాలను ఆశ్రయిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా పరీక్షల అబ్జర్వర్‌ అందుబాటులోకి రాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top