రేపు ప్రధాని, సోనియా ఏరియల్ సర్వే | manmohan and Sonia gandhi make aerial survey of flood hit areas | Sakshi
Sakshi News home page

రేపు ప్రధాని, సోనియా ఏరియల్ సర్వే

Oct 30 2013 1:40 AM | Updated on Sep 2 2017 12:06 AM

పై-లీన్ తుపాను, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు ఈ నెల 31న ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు ఈ నెల 31న ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి వరకు ఖరారైన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గురువారం ఉదయం 11 గంటలకు వారు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లి శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి, పంట నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. ఆ తరువాత ఒడిశాలోని గంజాం జిల్లాలో తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో కూడా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
 
 

అనంతరం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. తుపాను, వరద నష్టాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను వీక్షించనున్నారు. బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో మన్మోహన్, సోనియాలకు స్వాగతం పలుకనున్నారు. ఇలావుండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి ంచనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు విమానంలో ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకుంటారు. లావేరు మండలం అడపాక జంక్షన్‌లో పత్తి పంట నష్టాన్ని పరిశీలిస్తారు. శ్రీకాకుళం పట్టణంతోపాటు మండలంలోని నొప్పంగిలో వరద నష్టాలను పరిశీలించిన అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వరద నష్టాలపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం విశాఖపట్నం చేరుకుని అనకాపల్లి మండలం కొప్పాడ గ్రామంలో నీట మునిగిన పంటలను పరిశీలిస్తారు. రాంబిల్లి మండలంలో పర్యటించాక విశాఖపట్నం చేరుకుని సర్క్యూట్ హౌస్‌లో అధికారులతో సమీక్షిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement