ఛాతీనొప్పితో తీసుకొస్తే సూదేసి చంపేశారు

Man Died With Hospital Staff Negligence In Anantapur - Sakshi

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత     

కుటుంబసభ్యుల ఆందోళన

అనంతపురం, హిందూపురం అర్బన్‌: ‘ఛాతీలో నొప్పిగా ఉందంటే ఆసుపత్రికి తీసుకొచ్చాం. డాక్టర్‌ లేడు. డ్యూటీలో ఉండే నర్సు ఇంజక్షన్‌ ఇచ్చింది. పది నిమిషాలకే ప్రాణం పోయింది’ అంటూ తండ్రిని పోగొట్టుకున్న ఆర్టీసీ కాలనీకి చెందిన అతీబ్, రహిమాన్‌ స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు... ఆర్టీసీ కాలనీలో నివాసముండే రిటైర్డు ఆర్టీసీ మెకానిక్‌ అబ్దుల్‌సలాం(65) బుధవారం రాత్రి నమాజ్‌ తర్వాత ఛాతీనొప్పిగా ఉందని చెప్పారు. కుమారులు అతీబ్, రహిమాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ లేరు. అబ్దుల్‌సలాం నొప్పితో బాధపడుతూ ఉండటంతో హెడ్‌నర్సు ఇంజక్షన్‌ వేశారు. కొంతసేపటికే ఆయనలో కదలిక లేకుండా పోయింది. అంతలో డాక్టర్‌ శివకుమార్‌ వచ్చి పరిశీలించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు, సíన్నిహితులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నొప్పి తగ్గిస్తారని తీసుకొస్తే చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు డ్యూటీలో ఉండే డాక్టర్‌ ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకుని వారికి సర్ధి చెప్పడానికి చూశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేశవులు కూడా వచ్చి వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. కానీ బాధితులు వినలేదు. ఆసుపత్రిలో ఒకరోజు ఐదుగురు పిల్లలు చనిపోతేనే ఇంతవరకు ఏ చర్యలూ తీసుకోలేదే... ఇప్పుడేం చర్యలు తీసుకుంటారని అడిగారు. ఆసుపత్రిలో నర్సులు, సిబ్బంది రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చులకనగా చూస్తున్నారని ఆవేదన చెందారు. తర్వాత టౌటౌన్‌ సీఐ తమీంఅహ్మద్‌ వచ్చి తాము చర్యలు తీసుకుంటామని బాధితులకు సర్దిచెప్పారు. దీంతో వారు రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని తీసుకుని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top