సోనియాను తిడితే పుట్టగతులుండవ్
అధినాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ డిమాండ్ చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధినాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ డిమాండ్ చేశారు. మూడు తరాలుగా పార్టీలో కొనసాగుతూ పదవులు అనుభవించిన జేసీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం దారుణమన్నారు. అధినేత్రిని దూషిస్తే ఇతర పార్టీలు ఆహ్వానిస్తాయనే ఆలోచనతోనే సోనియాపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లేశ్ మాట్లాడారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ‘గాంధీ’ కుటుంబంపై ఆరోపణలు చేసే నైతిక హక్కు దివాకర్‌కు లేదన్నారు.
ఒక ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసినా.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే లక్ష్యంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్న సోనియాను విమర్శిస్తే పుట్టగతులుండవన్నారు. 35 ఏళ్లుగా పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి కోట్లాది రూపాయలు కూడబెట్టిన దివాకర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీని విమర్శిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
అర్హులందరూ ఓటర్లుగా నమోదు కండి
అర్హులందరూ ఓటర్లుగా నమోదు కావాలని మల్లేశ్ విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, 17వ తేదీ నాటికీ 18 ఏళ్లు నిండిన యువత ఓటుహక్కును పొందాలని కోరారు. విలేకరుల సమావేశ ంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.