రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాష్ర్ట పార్టీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించనున్న జిల్లా సమైక్యబంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సాక్షి, నెల్లూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాష్ర్ట పార్టీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించనున్న జిల్లా సమైక్యబంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ పది నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌లో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందన్నారు. ముఖ్యంగా రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా తీవ్రంగా నష్టపోతుందని మేరిగ ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర బిడ్డగా విభజనను అడ్డుకోవాల్సిన చంద్రబాబు విభజనకు మద్దతు పలికి సీమాంధ్రులకు తీరని ద్రోహం తలపెట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శాయశక్తులా కృషి చేస్తోందని మేరిగ చెప్పారు.
పార్టీ అధినేతలు విజయమ్మ, జగన్ ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేపట్టారన్నారు. విభజన ఆగేవరకూ పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. శుక్రవారం బంద్‌ను విజయవంతం చేయడమేకాక ఈ నెల 6న జరగనున్న మానవహారాలు, 7 నుంచి 10 వరకూ నిర్వహించ నున్న రిలేదీక్షలను కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర సాధన కోసం జరగనున్న ఈ పోరాటాల్లో సమైక్యవాదులందరూ పాల్గొనాలని మేరిగ మురళీధర్ పిలుపు నిచ్చారు.