రూపునిస్తారు.. రోడ్డుపైకి తెస్తారు !

Lorry Buiding Sheds in Krishna - Sakshi

 కళకళలాడుతున్న లారీ బాడీ బిల్డింగ్‌ షెడ్డులు

లారీల అమ్మకాలలో పెరుగుదలతో పూర్వవైభవం

పనులు ముమ్మరం..     కార్మికుల కొరత తీవ్రం

స్థలాభావంతో ఇబ్బందులు

ఆటోనగర్‌(విజయవాడ తూర్పు): లారీ మెకానిక్‌ బాడీ బిల్డింగ్‌ పనులకు విజయవాడ ఆటోనగర్‌ పేరుగాంచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా లారీల యజమానులు వచ్చి ఇక్కడ బాడీ కట్టించుకుంటారు. ఈ ఏడాది పనులు ముమ్మరంగా ఉంటున్నట్లు లారీబాడీ బిల్డింగ్‌ షెడ్డుల యజమానులు చెబుతున్నారు. గత ఏడాది డీజిల్‌ ధరలు పెరగడంతో కొత్త లారీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని, ప్రస్తుతం నిలకడగా ఉండడంతో లారీల కొనుగోలు పెరిగిందని చెబుతున్నారు. ఆటోనగర్‌లో బాడీ బిల్డింగ్‌ చేయించుకునేందుకు గాను అధిక సంఖ్యలో కొత్తలారీలు షెడ్‌లకు వచ్చాయి. దీంతో మరలా లారీబాడీ బిల్డింగ్‌ పనులు మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా మారింది. రెండు నెలల నుంచి పనులు ఊపందుకుంటున్నాయి.

300 పైగా షెడ్డులు...
ఆటోనగర్‌లో సుమారు 300లకు పైగా లారీ బాడీ బిల్డింగ్‌ షెడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షెడ్డులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే బాడీబిల్డింగ్‌  పనులు చేసేందుకు గాను కార్మికులు సరిపడా లేరని యజమానులు చెబుతున్నారు.  గతంలో కార్మికులు 2 వేల మందికి పైగా ఉండేవారని,  పనులు సక్రమంగా దొరకపోవడంతో వారు వేరే పనుల వైపు వెళ్లడంతో ప్రస్తుతం కార్మికుల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. దీంతో గతంలో పనిచేసిన మెకానిక్‌లు, వేరే కార్మికుల వద్దకు వెళ్లి వారిని బతిమిలాడి తీసుకు రావాల్సి వస్తోందని, అయినప్పటికీ వారు అడ్వాన్స్‌లు ఇస్తేనే పనులకు వచ్చే పరి స్థితి నెలకొని ఉంది. ఈ పని మినహా వేరొక పని చేయలేమని అందుకే ఈ పనిని  వదిలేయకపోతున్నామని షెడ్‌ల యజమానులు వాపోతున్నారు.

స్థలం కొరతతో ఇక్కట్లు...
లారీలను పెట్టుకునేందుకుగాను ఇక్కడ స్థలం సరిపడినంత లేకపోవడంతో షెడ్డు యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క లారీకి బాడీబిల్డింగ్‌ పనులు చేయాలంటే కనీసం 15 నుంచి 30 రోజులు సమయం పడుతుంది. మిగతా లారీలను పెట్టుకునేందుకు స్థలం సరిపోవడంలేదని షెడ్డుల యజమానులు చెబుతున్నారు. ఏమి చేయాలో తెలీక ఒక్కోసారి పని వదులుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం లారీ బిల్డింగ్‌ పనులకు సరిపోయేంత స్థలం ఇవ్వాలని  వారు కోరు  తున్నారు.

బాడీబిల్డింగ్‌ ఇలా...
లారీ కొనుగోలు చేసినప్పుడు దానికి ఎటువంటి సీటింగ్, బాడీ, ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాలు తదితరాలు ఏమీ ఉండవు.. దానికి కార్మికులు మంచి బాడీ కట్టి, పెయింటింగ్‌ వేసి, సీటింగ్‌ అమర్చి, కావాల్సిన లైట్లు ఏర్పరిచి అందంగా ముస్తాబు చేసి ఇస్తారు. దీనికి  టింకరింగ్, పెయింటింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్‌తో పాటు పలు పనులన్నింటిని చేస్తారు. లారీ కంపెనీ వారు బాడీబిల్డింగ్‌ చేయాలంటే కనీసం మూడు మాసాలు పడుతుంది. అదే ఆటోనగర్‌లో అయితే 15 రోజుల నుంచి నెలరోజుల్లోపే చేసి యజమానులకు అప్పగిస్తారు. ఒక లారీ బాడీ బిల్డింగ్‌ పనులు చేయాలంటే రూ.3.80 నుంచి రూ.4 లక్షలు కాంట్రాక్ట్‌ ఇస్తున్నారని యజమానులు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top